భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న బియ్యం ఎగుమతి నిషేధం పాకిస్తాన్ రైతుల పంట పండించింది.వివరాల్లోకి వెళితే ..
అంతర్జాతీయ మార్కెట్కు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధిస్తూ భారత ప్రభుత్వం జూలై 20వ తేదీన నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. రాబోయే పండుగ సీజన్లని దృష్టిలో ఉంచుకుని, దేశీయంగా బియ్యం కొరత రాకుండా చూడడానికి, అదేవిధంగా బియ్యం రిటైల్ ధరల లో విపరీతమైన హెచ్చుతగ్గులు లేకుండా చూడడానికి, బియ్యం ధరను స్థిరీకరించడానికి భారత ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించింది. అయితే, ఈ చర్య అనుకోకుండా పాకిస్థానీ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టించింది.
భారత ప్రభుత్వం విధించిన ఈ నిషేధం ఫలితంగా పాకిస్థానీ సంస్థలకు ఎగుమతి ఆర్డర్లు గణనీయంగా పెరిగాయని పాకిస్థాన్ రైస్ ఎగుమతిదారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. భారత్కు చెందిన బాస్మతీయేతర బియ్యం మార్కెట్ లో లభించకపోవడంతో సహజంగానే బియ్యం వినియోగదారులు పాకిస్థానీ బియ్యం వైపు మొగ్గు చూపడంతో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ బియ్యానికి డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. పెరుగుతున్న ఈ డిమాండ్ ఫలితంగా, పాకిస్థానీ బాస్మతీయేతర బియ్యం ధర కూడా గణనీయంగా పెరిగింది. భారత నిషేధానికి ముందు, ఇది టన్నుకు 450 అమెరికన్ డాలర్ల ధర వద్ద ఉండగా ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇది టన్నుకు 500 అమెరికన్ డాలర్లకు పెరిగింది. అయితే రానున్న కొద్ది రోజుల్లో ఈ ధర 600 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, యూరప్ లోని పలు ఇతర దేశాల తో పాటు రష్యా నుండి కూడా బియ్యం కోసం పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నట్లు పాకిస్తాన్ బియ్యం ఎగుమతి దారుల సంఘం చెబుతోంది . అంతేకాదు పాకిస్థానీ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు మెక్సికోతో చర్చలు కూడా జరుగుతున్నాయని ఈ సంఘం ప్రకటించింది.
మొత్తం మీద మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ రైతుల పంట పండిస్తూ ఉండగా, ధర పెరిగిందని చెప్పి విపరీతంగా ఎగుమతి చేస్తే భారత ప్రభుత్వం ఏ ప్రమాదాన్ని అయితే ఈ నిషేధం ద్వారా నివారించిందో, అదే ప్రమాదం పాకిస్తాన్ కు కూడా పొంచి ఉందని, పాక్ ప్రభుత్వం మేల్కొని పాకిస్తాన్ లో బియ్యం సంక్షోభం రాకుండా నివారించడానికి ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవాలని అక్కడ నిపుణులు హెచ్చరిస్తున్నారు.