Krishna Gadu Ante Oka Range movie review
సామజవరగమన, బేబీ సినిమాలతో ఈమధ్య చిన్న సినిమాలకు కాస్త ఊపు వచ్చింది. ఏ పుట్టలో ఏం పాముందో అన్నట్టు…. ప్రతీ చిన్న సినిమాపైనా ఓ లుక్ వేస్తోంది చిత్రసీమ! ఈ వారం కూడా చాలా చిన్న సినిమాలు బాక్సాఫీసు ముందు బారులు తీరాయి. వాటిలో `కృష్ణగాడు ఒక రేంజ్` ఒకటి. టీమ్‌లో ఉన్నవాళ్లంతా కొత్తవాళ్లే. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు.. వీళ్లంతా కొత్త మొహాలే! కాకపోతే పోస్టర్, టైటిల్, టీజర్ ఆకట్టుకొన్నాయి. దాంతో.. ఈ సినిమాపైనా ఓ లుక్ వేయాల్సివచ్చింది.
కథలోకి వెళ్తే… అది గుంటూరు సమీపంలోని ఓ పల్లెటూరు. అక్కడ కృష్ణ (రిష్వి తిమ్మరాజు) మేకల మందని మేపుకొంటూ జీవనం సాగిస్తుంటాడు. నాన్న లేడు. అమ్మంటే ప్రాణం. అమ్మక్కూడా కృష్ణ అంటే చాలా మమకారం. సొంత ఇల్లు కట్టుకోవాలన్నది ఓ కల. అదే ఊర్లో ఉండే సత్య (విస్మయ శ్రీ) చలాకీ అమ్మాయి. కృష్ణకి మరదలు వరుస. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. సత్యకి ఓ రౌడీ బావ ఉంటాడు. పేరు… దేవా (వినయ్). తన ఇంట్లోనే కృష్ణ అద్దెకు ఉంటాడు. కృష్ణ, సత్యల ప్రేమని దేవా భరించలేడు. దానికి తోడు సత్య కూడా దేవాని ఛీ కొడుతుంది. దాంతో కృష్ణపై దేవా పగ పెంచుకొంటాడు. ఓరోజు కృష్ణ, దేవాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ కోపంలో `మూడు నెలల్లో ఇల్లు కట్టి చూపిస్తా` అని కృష్ణ శపథం చేస్తాడు. మరి మూడు నెలల్లో కృష్ణ ఇల్లు కట్టాడా? కృష్ణగాడంటే ఒక రేంజ్ అంటూ ఊర్లో వాళ్ల ముందు కాలర్ ఎగరేసే కృష్ణ.. తన రేంజ్ చూపించాడా? లేదా? అనేది మిగిలిన కథ.
ఓ అందమైన పల్లెటూరు. అక్కడో యవ్వన జంట. వాళ్ల మధ్య చిగురించిన ప్రేమ, అందులోని ఘర్షణ. చివరికి హీరో విజయం సాధించడం, తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడడం క్లుప్తంగా ఇదే కథ. ఇందులోనే కాస్త క్రైమ్ ఎలిమెంట్ నీ జోడించి ప్రేమ కథలో మరింత ఆసక్తి కల్పించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. తొలి సగం అంతా ప్రేమ వ్యవహారమే. హీరో హీరోయిన్లు ఒకర్నొకరు చూపుల్తో ప్రేమించుకోవడం, ఉడికించుకోవడం, పాటలూ, విలన్ తో యాక్షన్ ఎపిసోడ్, ఊర్లో ఆవారా బ్యాచ్ మధ్యలో ఓ రౌడీ సబ్ ట్రాక్.. ఇలా సినిమా నడిచిపోతుంటుంది. ప్రేమకథలో కొత్తదనం ఏం కనిపించదు. కాకపోతే ఫ్రెష్ ఫేసెస్ కాబట్టి చూడ్డానికి కూడా ఇబ్బందేం ఉండదు. ప్రేమకథ, అందులోని సన్నివేశాలు ఆర్గానిక్ గా పుట్టకపోయినా, పల్లెటూరు, అక్కడి వాతావరణం, పాత్రలు ఇవన్నీ కాస్త ఆర్గానిక్‌గా అనిపిస్తాయి. మూడు నెల్లలో ఇల్లు కట్టి చూపిస్తా అని హీరో శపథం చేయడంతో ఇంట్రవెల్ కార్డు పడుతుంది.
అసలు మూడు నెలల శపథానికీ తన ప్రేమకీ ఏమాత్రం లింకు లేకుండా చూసుకోవడం దర్శకుడిలోని అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇల్లుకీ – పెళ్లికీ ముడి పెడితే కాస్త సంఘర్షణ ఏర్పడేది. సెకండాఫ్‌లో ఏమవుతుందో? కథ ఎలాంటి మలుపు తీసుకొంటుందో చెప్పడానికి దర్శకుడు తొలి సగంలోనే కొన్ని బీజాలు వేశాడు. హీరో వాళ్ల అమ్మ తరచూ దగ్గుతుండడం, ఆ ఊరి చివర ఖాళీగా ఉన్న ఓ బంగ్లా నుంచి మాటలు వినిపిస్తుండడం.. ఇవన్నీ సెకండాఫ్ కి దర్శకుడు వేసుకొన్న పునాదులే. కాస్త బుర్ర పెట్టి ఆలోచించినా, ప్రేక్షకులకు కథ ఎలా నడవబోతోందో అర్థమైపోతుంటుంది. ఊర్లో ముగ్గురు ఆవారా స్నేహితులు అటూ, ఇటూ తిరుగుతుంటారు. అసలు కథకూ వాళ్లకూ ఏమాత్రం కనెక్షన్ ఉండదు. వాళ్లని చివర్లో వాడుకొంటాడన్న సంగతి కూడా ఇట్టే తెలిసిపోతుంటుంది. ఇదేం.. సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. కేవలం ప్రేమ కథ. అలాంటప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే ఏమాత్రం అవసరం లేదు. సెకండాఫ్‌లో ప్రేమ కథ మరుగున పడిపోయి, క్రైమ్ స్టోరీ ముందుకు వస్తుంది. లవ్ స్టోరీలో ఎమోషన్, క్రైమ్ స్టోరీలో సస్పెన్స్, థ్రిల్ ఇవేం సరిపడా కుదర్లేదు. దాంతో ఈ సినిమా రెంటికీ చెడింది. నిజానికి ఇల్లు కట్టుకోవడం అనేది సామాన్యుడి కల. పేదలకు అది అందని వరం. దాన్ని ఓ ప్రేమకథకు ముడి పెట్టడం మంచి ఆలోచన. కథంతా అటువైపు సాగినా బాగుండేది. ఆ కథని మధ్యలో ఆపేసి.. అమ్మకు కాన్సర్, బాధలు, రౌడీ మూక, మర్డర్ అంటూ పెడదోవ పట్టింది.
ఈ చిత్రబృందాన్ని ఓ విషయంలో మెచ్చుకోవాలి. సినిమా అంతా లోకల్ టాలెంట్ తో నడిపించేశారు. నటీనటులు, సైడ్ క్యారెక్టర్లు అంతా కొత్తవాళ్లే. ఎవరి నటనలోనూ ఇదే తొలి సినిమా అనే ఫీలింగ్ రాలేదు. హీరో, హీరోయిన్ల ఫేసులు ఫ్రెష్‌గా ఉన్నాయి. విస్మయని చూడగానే హీరోయిన్గా రిజిస్టర్ చేసుకోవడం కష్టం. కాకపోతే.. పల్లెటూరు గడుగ్గాయిగా తన నటన బాగుంది. కృష్ణ నటనలో ఇంకా రాటు దేలాలి. తక్కువ వయసే కాబట్టి, అనుభవం ద్వారా నేర్చుకొనే అవకాశం ఉంది. తనలో తనీష్ పోలికలు కనిపిస్తున్నాయి. దేవా పాత్రలో నటించిన కుర్రాడు కూడా విలనిజం బాగానే పండించాడు.
పల్లెటూరి నేపథ్యంలో ఆర్గానిక్‌గా ఓ ప్రేమకథని చెప్పాలనుకొన్నాడు దర్శకుడు. ప్రేమకథలో ఫీల్ తీసుకురావడంలో విఫలం అయ్యాడు. ద్వితీయార్థంలో హీరో బాధలు ఎక్కువైపోయాయి. పాటలు కాస్త ఫర్వాలేదనిపించాయి. సాహిత్యం చెవులకు వినిపించేలా సంగీత దర్శకుడు జాగ్రత్తలు తీసుకొన్నట్టు అనిపిస్తుంది. పల్లెటూరి కథ కాబట్టి.. కెమెరా ఎటు తిప్పినా పచ్చగానే కనిపించింది. చిన్న సినిమా, పరిమిత బడ్జెట్లో తీశారు కాబట్టి, క్వాలిటీ గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే ఉత్తమం.
ఈమధ్య ప్రేమ కథలు చూడాలంటే కుటుంబ ప్రేక్షకులు కాస్త భయపడుతున్న మాట వాస్తవం. ప్రేమ పేరుతో ముద్దులు, లిప్ లాక్లూ, హద్దులు దాటిన సన్నివేశాలు చూడాల్సివస్తుందేమో అని వాళ్ల భయం. మిగిలిన సినిమా మాటెలా ఉన్నా, తప్పొప్పులు ఎన్ని ఉన్నా – ఓ ప్రేమకథని క్లీన్‌గానే చూపించాలన్న దర్శకుడి ఆలోచనని మెచ్చుకోవాలి. అదొక్కటే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అనుకోవాలి.