తెలంగాణలోని కోకాపేట భూముల వేలం… హాట్ టాపిక్ గా మారింది. ఒక్కో ఎకరానికి రూ. వంద కోట్లు చెల్లించేందుకు రియల్టర్లు ముందుకు వచ్చారు. ఇప్పుడిది కొత్త సంచలనం. అయితే హైదరాబాద్‌కు ఉన్న క్రేజ్.. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న వైనం.. .. తరలి వస్తున్న అంతర్జాతీయ సంస్థలతో… ఈ డిమాండ్ పెద్ద ఆశ్చర్యమేమీ కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సర్కార్ ఎలాంటి రాజకీయాలు చేసినా… నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసుకోవడం లేదని… చెబుతున్నారు.
అదే ఏపీలో ప్రభుత్వం భూముల్ని అమ్ముతామని వేలం ప్రకటనలు చేస్తే.. ప్రకటనల ఖర్చు తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఎకరాలు కాదు కదా.. గజాల లెక్కన కొనడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపరు. ఇది చాలా సార్లు ఫ్రూవ్ అయింది. గత రెండేళ్లుగా సిఆర్‌డిఎకు ఉన్న సొంత ప్లాట్లను ఈ వేలం ద్వారా అమ్మకానికి పెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నవులూరు దగ్గర మొత్తం 285.17 ఎకరాల్లో 1,327 ప్లాట్లను అభివృద్ధి చేశారు .ప్రభుత్వం చదరపు గజానికి రూ.17,800గా ధర నిర్ణయించింది.కనీసం వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్లాట్ల ఇ-ఆక్షన్‌కు కూడా అంత స్పందన కనిపించ లేదు. ఇద్దరు, ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారు కూడా తర్వాత డ్రాప్ అయిపోయారు.
ఈ ప్లాట్లకు అతి దగ్గరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అకాడమీ, ఎయిమ్స్ ఆస్పత్రితో పాటు మంగళగిరి రైల్వేస్టేషన్ కూడా ఉన్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేక ఎవరూ ముందుకు రావడం లేదు. అమరావతిని నిర్వీర్యం చేసి. అక్కడ భూముల్ని అమ్మడానికి చేసిన ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయని.. డబ్బులు పెట్టికొనేవాళ్లు ఓ మాదిరిగా కూడా ప్రభుత్వానికి కనిపించంరా అనేది ఎక్కువ మంది చెప్పే మాట. కొసమెరుపేమిటంటే… పేదలకు ఇళ్ల స్థలాలు తక్కువకే ఇస్తామని జగనన్న లే ఔట్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నింంచి ఫెయిలయింది ప్రభుత్వం. వాటినీ ఎవరూ కొనడం లేదు.
ప్రభుత్వం అనేది.. తనపై నమ్మకం పెంచుకుంటేనే విలువ ఉంటుంది. లేకపోతే ఏపీ ప్రభుత్వంలా అయిపోతుంది.