ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అనేక చర్చలకు కారణం అవుతోంది. ఎవరూ అనకపోయినా… ఎవరో ముక్కూ ముఖం తెలియని వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని… ఆయన ఇటీవల చెలరేగిపోతున్నారు. తన పై దుష్ప్రచారం చేస్తున్నారని తాను బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఎవరు అన్నారు మహా ప్రభో… ఎవరో ఏదో అంటే మీరు ఎందుకు దాన్ని రచ్చ చేసుకుంటున్నారు..అందరికీ తెలిసేలా చేసుకుంటున్నారని అడుగుతున్నా స్పందించడం లేదు.
కానీ కాంగ్రెస్ పార్టీతో పాటు… బయట కూడా ఉత్తమ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి జంప్ కొట్టడానికి కారణం వెదుక్కుంటున్నారని ఏదీ దొరకక… చివరికి తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం అనే పాయింట్ ను పట్టుకున్నారని అంటున్నారు. నిజానికి ఇలాంటి ప్రచారాలు జరగని నేత అంటూ ఉండరు. దాన్నే సీరియస్గా తీసుకుంటే… ఎవరూ ఉన్న పార్టీల్లో ఉండరు. తాజాగా ఓ బహిరంగ లేక రాసిన ఉత్తమ్ తన ఫిర్యాదుల్ని హైకమాండ్ కూడా పట్టించుకోవడం లేదన్నారు. అయితే హఠాత్తుగా ఆయనకు హైకమాండ్ ఓ కీలక పదవి ఇచ్చింది.
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఆయనను సభ్యుడిగా నియమించింది. ఈ స్క్రీనింగ్ కమిటీ టిక్కెట్లను ఖరారు చేస్తుంది. ఈ కమిటీలో ఉత్తమ్ కు చోటు లభించడంతో ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. ఇక ఉత్తమ్ సర్దుకున్నట్లేనని… కొంత మంది భావిస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నారని మరికొంత మంది చెబుతున్నారు.