పుంగనూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్లు దాడులు చేసి.. టీడీపీ వాళ్లు తిరగబడే సరికి పారిపోయిన వైసీపీ నేతలకు.. తాము అప్పుడే అధికారం పోగొట్టుకున్నామని ఫిక్సయిపోయారు. చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చేశారు. అధికారంలో ఉన్నపార్టీ… ఇలా బంద్ కు పిలుపునివ్వడం వారిలోని నిరాశ నిస్పృహను స్పష్టంగా బయటపెడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇంత కాలం పుంగనూరులో అరాచక సామ్రాజ్యాన్ని పెద్దిరెడ్డి నడుపుతున్నారు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారి ఇంటిపైకి మూకల్ని పంపి దాడులు చేయించడం ఆయన నైజం. చివరికి ఏ పార్టీలో లేని రామచంద్రయాదవ్ అనే నేత నియోజకవర్గంలో తిరిగినా ఆయన దాడులు చేయిస్తారు. ఇప్పుడా రామచంద్రయాదవ్ కూడా సొంత పార్టీ పెట్టుకుని పుంగనూరులోనే తేల్చుకుంటానంటున్నారు. చంద్రబాబును పుంగనూరు రానీయకుండా చేయాలని పోలీసుల్ని అడ్డు పెట్టుకుని సృష్టించిన బీభత్స కాండ రివర్స్ అయిపోయింది. ఎప్పుడూ దాడులకు గురవడమే కానీ ఇంత కాలం ఎదురుదాడి చేయని టీడీపీ నేతలు ఇప్పుడు సహనం కోల్పోయారు. చంద్రబాబు కూడా తరమమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారికి శక్తి వచ్చింది.
ఇంత కాలం దాడులు చేస్తున్నా.. సహిస్తున్నామని.. సహనానికైనా ఓ హద్దు ఉంటుందని టీడీపీ నేతలు నిరూపించారు. ఈ విషయాన్ని వైసీపీ జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉన్నామన్న స్పృహను మర్చిపోయి బంద్కు పిలుపునిచ్చారు. సాధారణంగా తమకు అన్యాయం జరిగిందని విపక్షాలు బంద్కు పిలుపునిస్తే నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇక్కడ అధికార పార్టీనే పిలుపునిచ్చి.. అధికార పార్టీనే సక్సెస్ చేసుకుంటుంది. అదికారం పోవడం పక్కా అని ఫిక్సయిపోయి.. ఇప్పుడు పోయినట్లుగా రాజకీయం ప్రారంభించేశారని సెటైర్లు ఈ కారణంగానే వినిపిస్తున్నాయి.