విజయసాయిరెడ్డికి మళ్లీ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా జగన్ రెడ్డి షో చేస్తున్నారు కానీ.. ఆయనను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఢిల్లీలో వైసీపీ అంటే విజయసాయిరెడ్డి.. విజయసాయిరెడ్డి అంటే వైసీపీ. వైసీపీ తరపున కేంద్రంతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉంటారు. పార్టీ విధానాలను ఆయనే ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఢిల్లీ వ్యవహారాలకు దూరం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఢిల్లీలో ఇక వైసీపీ తరపున అన్ని పనులు చక్కబెట్టడానికి వైవీ సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. టీటీడీ చైర్మన్ పోస్టులో నాలుగేళ్ల పాటు చక్రం తిప్పిన ఆయనను ఇప్పుడు తప్పించాల్సి వచ్చింది. ఆయనకు ఏదో ఓ పదవి ఇవ్వాలి కాబట్టి.. విజయసాయిరెడ్డిని తప్పించేసి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇటీవల విజయసాయిరెడ్డికి కోస్తాలో వైసీపీకి గుక్కతిప్పుకోని ఫలితాలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నాలుగు జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. దీంతో వైసీపీలో విజయసాయిరెడ్డి రాజకీయానికి ఘోరమైన ఎండింగ్ను జగన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఏదో గూడుపుఠాణి చేస్తున్నారన్న అనుమానాలు జగన్ రెడ్డిలో ఉన్నాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆయనను చాలాకాలంగా దూరం పెట్టారని.. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటన వెనుక ఏదో ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేయడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అనుబంధ సంఘాల బాధ్యతలను చెవిరెడ్డికి ఇచ్చేశారు.