ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. రాజ్ భవన్‌కు వచ్చిన ఉన్నతాధికారులతో చర్చించిన మీదట గవర్నర్ ఎట్టకేలకు బిల్లను ఆమోదించారు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్‌తో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సభ ముందుకు ఆర్టీసీ విలీన బిల్లు రానున్నట్టు తెలుస్తోంది. టీఎస్ఆర్టీసీ విలీన బిల్లును రెండు రోజులుగా గవర్నర్ పెండింగ్‌లో పెట్టడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి.
సంస్ధ ఉద్యోగులు, కార్మికులు చలో రాజ్‌భవన్‌కు పిలుపు ఇచ్చారు. బస్సులను బంద్ చేసి నిరసన తెలిపారు. విషయం రాజకీయంగా దుమారం రేపుతూండటం. బీజేపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉండటంతో బిల్లును ఆమోదించినట్లుగా భావిస్తున్నారు. మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగియాల్సి ఉంది. కానీ ఆర్టీసీ బిల్లు ఆలస్యం కావడంతో.. మరో రెండు రోజులు పొడిగించారు. . బిల్లుపై చర్చకు ఈ ఒక్కరోజు సమయం సరిపోదని విపక్షాలు కోరడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో భాగంగా సంబంధిత ఆర్టీసీ బిల్లును గవర్నర్‌కు పంపించారు. మామూలుగా అయితే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడ పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కానీ ఆర్థిక బిల్లులకు మాత్రం ముందుగానే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ విలీనం ఆర్థిక బిల్లు కిందికి వస్తుండడం వల్ల గవర్నర్ వద్దకు వెళ్లింది. పలు అంశాలపై వివరణ కోరి. చివరికి గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపారు.