పిల్లల ప్రైమరీ స్కూల్లో ఏడాది పాటు ఫీజు ఎంత ఉంటుంది ? ఓ మాదిరి స్కూల్లో అయితే కనీసం నలభై వేలు ఉంటుంది. అదే కార్పొరేట్ స్కూల్లో అయితే రూ. లక్ష ఉంటుంది. ఇక ఒకటో తరగతికి వస్తే.. ఓ మాదిరి స్కూల్లోనూ కనీసం రూ. 70వేలు వసూలు చేస్తారు. ఇంత వసూలు చేస్తేనే తాము విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయగలుగుతామని విద్యా సంస్థలు చెబుతాయి. కానీ ఏపీలో ఇంజినీరింగ్ కు ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజు ఎంతో తెలుసా… రూ. 70వేలే. ఇంత కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.
ఒకటో తరగతి స్థాయికి ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు
ఇంజినీరింగ్ విద్య అత్యంత కీలకమైనది. విద్యార్థిలో సృజనాత్మకకత అప్పుడే బయట పడుతుంది. దేశానికి పనికి వచ్చే ఆవిష్కరణలకు ఆలోచనా బీజాలు అక్కడే పడాలి. అందు కోసం.. ఎన్నెన్నో సౌకర్యాలను ఇంజనీరింగ్ కాలేజీలు కల్పించాలి. విద్యార్థుల ఆలోచనలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు చేయగలిగే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి మౌలిక సదుపాయాలు ఒక్క రోజులో రావు. క్రమంగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఫీజులను నియంత్రించేయడం… మరీ దారుణంగా స్కూల్ ఫీజుల్లా ఖరారు చేయడంతో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కూడా భారం తగ్గించుకుంటున్నాయి. విద్య ప్రమాణాలను తగ్గించేస్తున్నాయి.
ఫీజుకు తగ్గట్లుగానే నాసిరకం చదువులు !
ప్రభుత్వం అత్యంత తక్కువ ఫీజులు పెట్టడంతో చాలా కాలేజీలు మూతబడ్డాయి. వందకుపైగా కాలేజీల్లో అడ్మిషన్లు జరగడం లేదు. ఫీజులు ఏ మాత్రం గిట్టుబాటు అయ్యే అవకాశం లేకపోవడంతో వీలైనంత తక్కువ ఖర్చుతో పని పూర్తి చేయాలని… నాసిరకం విద్యకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్ దెబ్బతింటోంది.
ఫీజు రీఎంబర్స్ మెంట్ భారం తగ్గించుకోవడానికి విద్యార్థుల జీవితతో ఆటలు
ఫీజు రీఎంబర్స్ మెంట్ భారం తగ్గించుకోవడానికే ప్రభుత్వం కాలేజీ ఫీజుల్ని తగ్గించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఇక్కడా తేడాలు ఉన్నాయి. వైసీపీ నేతల గుప్పిట్లో ఉండే విద్యాసంస్థలకు ఓ ఫీజు.. ఇతరులకు మరో ఫీజు ఖరారు చేశారు. ఇక్కడా సామాజికవర్గ కోణం ఉంది. మనోడయితే.. ఆ కాలేజీల్లో ఫీజులు ఓ రేంజ్ లో నిర్ణయిస్తారు. లేదంటే.. పాతాళంలో ఖరారు చేస్తారు. ఇంకా “ఎగస్పార్టీ” వాళ్లయితే అనుమతులు కూడా ఇవ్వరు.
పొరుగు రాష్ట్రాలకు అత్యధిక వలస
హైదరాబాద్, చెన్నై,, బెంగళూరుని ప్రముఖ కాలేజీలు, ప్రైవేటు యూనివర్శిటీల్లో చదివేవారిలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఏపీలో మంచి కాలేజీలు .. ఉంటే అక్కడే జాయిన్ చేసుకునేవారు. కానీ… ఇంజనీరింగ్ విద్య నిర్వీర్యం కావడంతో చాలా మంది పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఏపీలో ఉన్న విట్, కేఎల్ , విజ్ఞాన్ వంటి ప్రైవేటు యూనివర్శిటీల్లో సీట్లకు తీవ్ర పోటీ ఉంటోంది.