తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టే పథకాలు .. వందల్లో వేలల్లో లబ్ది కలిగించేలా ఉండవు. కానీ లక్షల్లో ప్రజలకు అందేలా ఉంటాయి. ఇప్పటికి దళిత బంధు పేరుతో ఇంటికో పది లక్షలు ఇస్తున్నారు. ఇక బీసీలు, మైనార్టీలకు ఇంటికో లక్ష ఇస్తున్నారు. అయితే ఈ స్కీములన్నీ ట్రైలరేనని తమ వద్ద బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని… వాటిని మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించారు. నేరుగా అసెంబ్లీలోనే ఈ విషయం ప్రకటించడంతో కేసీఆర్ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాల జాతర ఉండబోతోందని స్పష్టమయింది.
2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమయంలో కేసీఆర్ … మేనిఫెస్టోను సీరియస్ గా తీసుకోలేదు. రైతు బంధు పథకానికి కొంత సాయం పెంచుతామని చెప్పారు. తరవాత కాంగ్రెస్ పార్టీ రకరకాల హామీలు ఇవ్వడంతో వారిచ్చిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పేదలు ఇళ్లు కట్టుకుంటే ఐదు లక్షలు తాము కూడా ఇస్తామని ప్రకటించారు. కానీ వాటిని అమలు చేయలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నందున అలు చేస్తామని చెబుతున్నారు. రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న సమయంలో ఎంత వరకు అమలు సాధ్యమన్నది మాత్రం ఎవరూ చెప్పలేరు. కానీ కేసీఆర్ అంతకు మించి పథకాలను ప్రవేశ పెట్టబోతున్నట్లుగా స్పష్టమయింది.
ఓ వైపు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. కర్ణాటకలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజల్లోకి వెళ్లడంతో విజయం లభించింది. అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ లను ప్రకటిచింది. భారీ హామీలు ఇచ్చింది. త్వరలో ఇతర వర్గాలకు డిక్లరేషన్లను ప్రకటించనుంది.. వీటిని తలదన్నేలా కేసీఆర్ పథకాల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. కానీ గత హామీలే అమలు చేయలేదు. .. ఇప్పుడు ప్రకటించబోయే హామీలను ప్రజలు నమ్ముతారా లేదా అన్నదే కీలకం.