కేసీఆర్ ఇచ్చిన మరో చాన్స్ ను బీజేపీ నేల పాలు చేసుకుంది. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ కాస్తంత రాజకీయం చేసినా.. దాన్ని అందిపుచ్చుకునే విషయంలో బీజేపీ పూర్తి స్థాయిలో తడబడింది. ఆ బిల్లును గవర్నర్ ఆపడాన్ని పూర్తి స్థాయిలో సమర్థించుకుని ఉంటే.. మళ్లీ రాజకీయం బీజేపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ బీజేపీ గవర్నర్ చేసిన రాజకీయాన్ని అందుకోవడంలో ఫెయిలయింది… ఆత్మరక్షణలో పడింది. గవర్నర్ ఊళ్లో లేరని ఈటల లాంటివాళ్లు ప్రకటనలు చేయాల్సి వచ్చిందంటే… బీజేపీ ఎంత ఇన్ సెక్యూరిటీగా ఫీలవుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి సమయంలో బండి సంజయ్ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆయన అప్పటికీ ఎదురుదాడి చేశారు. కేసీఆర్ బిల్లును అడ్డుకునేలా అసలు ఏ వివరాలు లేకుండా బిల్లు పంపారని ఆరోపించారు. అలాంటి ఎదురుదాడితో ఇతర నేతలు ముందుకు వచ్చినట్లయితే.. కేసీఆర్ సర్కార్ వివరణలు ఇచ్చుకోవాల్సి ఉండేది. ఇప్పుడు బిల్లును అసలు చర్చ లేకుండా ఆమోదించేసుకున్నారు. అందులో ఉన్న లోపాలను ఉద్యోగులకు జరిగే నష్టాలను చర్చించలేకపోయారు.
ఆర్టీసీ బిల్లును అసెంబ్లీ ఆమోదించినా.. అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం పడుతుంది. ఎందుకంటే.. అసలు బిల్లు ఆర్టీసీ విలీనం కాదు. ఆర్టీసీ ఉద్యోగుల్ని మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు. అంటే ప్రభుత్వం ఇస్తుంది. వారు ఆర్టీసీ కోసం పని చేస్తారు. ఆర్టీసీకి జీతాల ఖర్చు మిగులుతుంది. ఉద్యోగుల డిమాండ్లన్నింటినీ పరిష్కరించి.. వారిని ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విభాగమనో.. మరో పేరు పెట్టి కొత్తశాఖ ఏర్పాటు చేసి వారినిఆ విభాగం ఉద్యోగులుగా గుర్తించాలి. కానీ కేటీఆర్ అక్టోబర్లోనే ఎన్నికలు వస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. అంటే.. ఏదైనా ప్రక్రియ పూర్తి అయ్యేది ఎన్నికల తర్వాతేనన్నమాట.
ఈ విషయాలను బలంగా చెప్పే అవకాశాన్ని కేసీఆరే కల్పించారు. కానీ గందరగోళపడి బీజేపీ వచ్చిన అవకాశాన్ని.. గవర్నర్ కల్పించిన మంచి చాన్స్ ను మిస్ చేసుకున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి