ఉదయ్ కిరణ్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా… చిరంజీవి కుటుంబం గురించి కూడా మాట్లాడుకోవడం పరిపాటి అయ్యింది. చిరు కుటుంబమే.. ఉదయ్ కిరణ్కి తొక్కేసిందని, ఆ బాధలోనే ఉదయ్ ఆత్మహత్య చేసుకొన్నాడని ఇప్పటికీ.. కొన్ని ఛానళ్లు, సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన యూ ట్యూబ్ ఛానళ్లూ.. చిరుపై తమ అక్కసుని తీర్చుకొంటుంటాయి. గమ్మత్తేమిటంటే.. చిరు వీటిపై ఒక్కసారి కూడా స్పందించలేదు. తనపై ఎన్ని రాళ్లు విసిరినా… భరించాడు. సహించాడు. ఇప్పుడు మరోసారి ఉదయ్ కిరణ్ ప్రస్తావన వచ్చింది. అది కూడా.. చిరు సమక్షంలోనే.
భోళా శంకర్ ప్రీ రిలీజ్ లో మైకు పట్టుకొన్న హైపర్ ఆది… ఎప్పటిలా అనర్గళంగా మాట్లాడేశాడు. పవన్, చిరు అంటే హైపర్కి పూనకం వచ్చేస్తుంది. అందుకే.. ఆ స్పీడు ఈసారి ఇంకాస్త ఎక్కువైంది. అయితే.. మధ్యలో ఉదయ్ కిరణ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఉదయ్ కిరణ్ ని చిరంజీవి కుటుంబమేతొక్కేసిందని అప్పట్లో మీడియా రాసిందని, అయినా చిరంజీవి క్షమించేశాడని గుర్తు చేశాడు. జరిగిన విషయాలే హైపర్ ప్రస్తావించి ఉండొచ్చు. కాకపోతే ఉదయ్ కిరణ్ వ్యవహారం చాలా సున్నితమైంది. చిరు దగ్గర ఆ విషయాన్ని ప్రస్తావించడం మరింత.. సున్నితం. ఎందుకంటే… చిరు ఇలాంటి మాటలు వినీ. వినీ విసిగిపోయాడు. సమయం సందర్భం లేకుండా ఉదయ్ ప్రస్తావన తీసుకురావడం మానుతున్న గాయాన్ని మళ్లీ రేపడమే అవుతుంది. అందునా చిరు సమక్షంలో. ఇప్పటి వరకూ ఉదయ్ కిరణ్ గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకొన్నారు.కానీ అవన్నీ చిరు పరోక్షంలో జరిగిన విషయాలు. ఈసారి నేరిగా ఆ టాపిక్ చిరు ముందే తీసుకొచ్చాడు హైపర్. తన ఉద్దేశ్యం మంచిదేకావొచ్చు, చిరు గొప్పదనం చెప్పడానికే కొవొచ్చు. కానీ ఇది సమయం కాదు. సందర్భం కానే కాదు.
అల్లు అరవింద్ కూడా ఇదే చేశారు. చిరంజీవి అంటేతనకెంత అభిమానమో చెప్పడానికి ఓ ఉదాహరణ వివరించారు. పన్నెండేళ్ల క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై అవాకులూచెవాకులూ వాగితే.. వాళ్లని జైలుకి పంపేంత వరకూ వదల్లేదు అంటూ పరోక్షంగా జీవిత, రాజేశేఖర్లను తీసుకొచ్చారు. పాపం.. జీవిత, రాజశేఖర్లు. వైకాపా పార్టీ చూపు తమవైపు పడుతుందన్న ఆశతో… అవగాహన రాహిత్యంతో చిరుపై బురద చల్లడానికి ప్రయత్నించారు. తాము తవ్వుకొన్న గోతిలో తామే పడ్డారు. అందులోంచి బయటకు ఎలా రావాలా…. అని ఆపపోపాలు పడుతున్న సమయంలో.. మరోసారి వాళ్ల టాపిక్ తీసుకొచ్చాడు అల్లు అరవింద్. అందునా చిరు సమక్షంలో.