తెలంగాణ సీఎం కేసీఆర్ ఫలానా చోట కొత్త మండలం కావాలంటే ఇట్టే ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు. ఇలా వచ్చిన డిమాండ్లను బట్టే 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇంకా తమకు జిల్లాలు కావాలని ఎవరైనా డిమాండ్ చేసి ఉంటే … ఏర్పాటయి ఉండేవి. అలాగే రెవిన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తమకు కొత్త పంచాయతీలు కావాలని గ్రామాల స్థాయిలో వస్తున్న డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. కనీసం 250 కొత్త పంచాయతీలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎవర్నీ నిరాశ పర్చాలని అనుకోవడం లేదు. వ్యక్తిగత సమస్యలు కాకుండా ఉలా ఊళ్లు , గ్రామాలకు సంబంధించినవి.. ఖర్చు లేనివి అయితే తక్షణం చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో తమకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు కావాలని కొన్నాళ్ల నుంచి ఉన్న డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇలా మొత్తగా 250 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీనిపై విస్తృత ప్రచారం జరిగితే మరికొన్ని కొత్త డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది.
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ గత ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అధికారాలు, నిధులు ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఆయా గ్రామాల వాసుల్లో ఉంది. కొత్త గ్రామ పంచాయతీల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించాలనుకుంటున్న ప్రభుత్వం నిధుల సమస్యను కూడా పరిష్కరించాల్సి ఉంది.