ఏపీలో ప్రభుత్వ పాలన ఎంత ఘోరంగా ఉందో చెప్పేందుకు ప్రతీ రోజూ అనేక ఉదాహరణలు బయటపడుతున్నాయి. అందులో అత్యంత దిగ్భ్రాంతికరమైనది సీఎంవోలో డిజిటల్ సిగ్నేచర్ల చోరీ. ఏకంగా ఈ ఫైలింగ్‌లో చొరబడి .. ముఖ్యమంత్రి డిజిటల్ సిగ్నేచర్ వాడి.. ఫైళ్లు క్లియర్ చేశారు. ఇలా 250కిపైగా ఫైళ్లు క్లియర్ అయినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుుతోంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఇదే చెబుతున్నారు. కానీ ఇంత వరకూ ఇంత దారుణమైన వైఫల్యానికి కారణం ఏమిటన్నది మాత్రం బయటపెట్టడం లేదు. నిందితులు ఎవరన్నది చెప్పడం లేదు. అసలేం జరిగింది ? నిందితులు ఎవరు అన్నది కూడా గోప్యంగా ఉంచుతున్నారు.
సీఎం డిజిటల్ సిగ్నేచర్ సంతకాన్ని ఉపయోగించి ఆయనకు తెలియకుండా ఫైళ్లు క్లియర్ చేయడం అంటే.. ఇక రాష్ట్రంలో పరిపాలన లేనట్లే. అసలు ఏ ఫైళ్లు క్లియర్ చేశారన్నది తేలాల్సి ఉంది. వీటి వెనుక అటెండర్ ఉన్నారని పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఓ అటెండర్ సీఎం డిజిటల్ సిగ్నేచర్ ను అసువుగా వాడేశారంటే.. ఇక పాలనా వ్యవస్థ కుప్పకూలినట్లే. అసలు పరిపాలన లేనట్లే. సీఎం అంటే ఓ పదవి మాత్రమే కాదు. ఓ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లే. ప్రజలకు దీనిపై సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
అయితే అందరూ దొంగలే.. దొరికిన వారు మాత్రమే బయటకు వచ్చే దొంగలని… పాపం దొరికారని వారిపై సానుభూతి చూపి… కేసులు గట్రా లేకుండా … చూసుకుందామన్న అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా ఉన్నారు. ఇంత దారుణమైన నేరాన్నిచాలా తేలికగా తీసుకుంటున్నారు. తమ ప్రభుత్వ పరువు పోతుందనో… ఇంకేవో లోపాయికారీ వ్యవహారాలు బయటపడతాయనో… పట్టించుకోకపోతే… ఇక పరిపాలనకు ఎలా అర్హులు అవుతారు ?