వైఎస్ వివేకానందరెడ్డి పుట్టిన రోజు అంటే జయంతి నేడు. ఆయన హత్యకు గురైన వర్థంతి.. పుట్టిన రోజు జయంతి వస్తే.. అబ్బాయిలు చేసే హడావుడికి హద్దే ఉండేది కాదు. తొలి జయంతికి విగ్రహం పెట్టేసి..దండలు కూడా వేశారు అవినాష్ రెడ్డి. అదీ కూడా కాస్త ఏడుపు మొహం పెట్టుకుని. కానీ ఇప్పుడు వివేకానందెరెడ్డి జయంతిని గుర్తు చేసుకోవడానికి కూడా వారెవరూ సిద్ధపడలేదు. నివాళులు అర్పించిన దాఖలాలు లేవు. కనీసం సోషల్ మీడియాలో అయినా ఓ పోస్ట్ పెట్టలేదు.
అబ్బాయిలు జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి మాత్రమే కాదు… వైసీపీ వాళ్లెవరూ వివేకానందరెడ్డికి కనీస నివాళి అర్పించలేదు. మామూలుగా అయితే.. వివేకా కేసులో నిజాలు బయటకు రాక ముందు .. విచారణ జరుగుతున్నప్పుడు చాలా హడావుడి చేసేవారు. ఇప్పుడు నేరుగా వారి గురించే వివరాలు బయటకు రావడం… సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడటం వంటివి జరిగిన తర్వాత ఇక వివేకాతో సంబంధం లేదని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. అందుకే ఎవరూ పట్టించుకోలేదు. ఎవరేమనుకున్నా .. కొత్తగా పోయేదేమీ లేదని అంతా అందరికీ తెలిసిపోయిందని అనుకుంటున్నారు.
వివేకాను పూర్తిగా మర్చిపోవడంపై టీడీపీ నేత నారా లోకేష్ సెటైర్ వేశారు. అబ్బాయిలకు.. బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ వర్థంతి మాత్రం డేట్, టైముతో సహా గుర్తుంటుందని సీబీఐ నిర్ధారించిందన్నారు. వేటు వేసిన చేతులతోనే బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనేమో వేయలేదని ఎద్దేవా చేశారు. అబ్బాయిల వేధింపులు-కుతంత్రాలకి ఎదురొడ్డి సోదరి సునీత గారు చేస్తున్న న్యాయపోరాటంలో తప్పక గెలుస్తారని.. వివేకానందరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని ప్రకటించారు.