ఏపీ ప్రభుత్వంపై విద్యుత్ ఉద్యోగులు ప్రకటించిన పోరాటాన్నిపట్టుదలగా సాగిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యుత్ ఉద్యోగికి ఇద్దరు చొప్పున పోలీసుల్ని కేటాయించి మానిటరింగ్ చేసి వారి ఉద్యమాన్ని అణిచి వేసే ప్రయత్నం చేస్తోంది. చలో విజయవాడ కార్యక్రమాన్ని మంగళవారం తాము ఉపసంహరించుకున్నామని ప్రకటించినా ప్రభుత్వం మాత్రం నమ్మలేదు. అంతా రోడ్డుపైకి వస్తే.. తమ ప్రభుత్వం రోడ్డున పడుతుందని… పోలీసుల్ని ప్రయోగించారు. విస్తృతంగా బందోబస్తు ఏర్పాటుచేశారు. విద్యుత్ సౌధ మొత్తం పోలీసులతో నిండిపోయింది. పోలీసుల భయం కూడా ఉద్యోగులు కూడా పట్టుదలగా ఉన్నారు.
ఈ ఆర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగానే చూస్తోంది. వారికి జీతాలు ఎక్కువ అని.. ఇంకా పెంచాల్సిన అవసరం లేదని.. తగ్గిస్తామన్నట్లుగా బెదిరింపులకు దిగింది. పీఆర్సీ కూడా ఇవ్వడం లేదు. చివరికి వారు ఆందోళన బాట పట్టారు. సమ్మెకు వెళ్తున్నారు. అయితే మిగతా ఉద్యోగా సంఘాల వాళ్లను నియంత్రించినట్లుగా .. కేసులతో విజిలెన్స్ తో వీరిని నియంత్రించాలని అనుకున్నారు. కానీ విద్యుత్ సంస్థల ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు.
ఇప్పటికే సీపీఎస్ రద్దు హామీ విషయంలో ఉద్యోగులు జగన్ రెడ్డి సర్కార్ పై కదం తొక్కడానికి రెడీగా ఉన్నారు. వారి అంగీకారం లేకండా కేబినెట్ లో జీపీఎస్ అమలు చేస్తామని తీర్మానం చేశారు. కానీ ఉద్యోగులు అంగీకరించడం లేదు. సీపీఎస్ ను రద్దు చేస్తామన్న హామీని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ర్యాలీలు ప్రారంభించారు. గతంలో నలుగురు ఉద్యోగ సంఘం నేతల్ని నమ్ముకుని వీరు నిండా మునిగిపోయారు. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు ఇస్తున్న నైతిక ధైర్యంతో మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వానికి కేసులు… పోలీసులతో అడ్డుకోవడం కూడా అసాధ్యమే.