దేశమంతా గెలిస్తే ప్రధాని అవుతారు. అది సాధారణ రాజకీయ నేతల అంచనా. కానీ మహారాష్ట్రలో గెలిస్తే ప్రధాని కావొచ్చు. ఇది కేసీఆర్ ప్లాన్. జాతీయ పార్టీ పేురతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మర్చారు. కానీ కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పార్టీ విస్తరణకే సమయం కేటాయిస్తున్నారు. కనీసం మరో పొరుగు రాష్ట్రం ఏపీ వైపు కూడా చూడటం లేదు. కానీ ఢిల్లీ పీఠం ఎక్కుతామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత దేశం మొత్తం విస్తరించాలనుకున్నారు. రైతు సమస్యలపై ప్రధానంగా రైతుల్ని రాజకీయ నేతల్ని చేద్దామనుకున్నారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తి చేశారు. కానీ తర్వాత పూర్తిగా మహారాష్ట్రకే పరిమితమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్రలో కలిపితే ఉన్న 65 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం కేసీఆర్ ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో 48 స్థానాలు, తెలంగాణలో 17 సీట్లలలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ చక్రం తిప్పొచ్చని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్కు చెందిన 65 మంది ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వమూ రాదని అంటున్నారు.
కేంద్రంలోహంగ వస్తే సంకీర్ణ రాజకీయంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో.. ఎవరికి అదృష్టం పడుతుందో అంచనా వేయడం కష్టం. చక్రం తిప్పే వారిదే రాజ్యం అవుతుంది. గుజ్రాల్, దేవేగౌడ అలాగే ప్రధానమంత్రులు అయ్యారు. కేసీఆర్ కూడా అదే వ్యూహంతో ఉన్నారు. హంగ్ వచ్చి.. బీఆర్ఎస్ పార్టీ యాభైకి పైగా స్థానాలు దక్కించుకుంటే… బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా కాంగ్రెస్.. కాంగ్రెస్ ను అధికారంలోకి రానివ్వకుండా బీజేపీ .. పోటీ పడి తమ పార్టీకి మద్దతిస్తాయని కేసీఆర్ నమ్మకం. అందుకే .. కష్టపడి దేశమంతా గెలిచే బదులు.. ఒక్క మహారాష్ట్ర గెలిస్తే చాలని కేసీఆర్ అనుకుంటున్నారు. మరి అద్భుతం జరుగుతుందా ?