వాల్తేరు వీరయ్య రెండొందల రోజుల ఫంక్షన్లో వైకాపా ప్రభుత్వంపై చిరు చేసిన కామెంట్లు.. పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. చిరు మాటలకు వైకాపా మంత్రులు వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు. చిరంజీవి కి సుద్దులు నేర్పే పనిలో ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నారు. ఇప్పుడు `బాయ్ కాట్ భోళా శంకర్`, `బాయ్ కాట్ మెగా హీరోస్` అంటూ రెండు కొత్త స్లోగన్లతో తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైకాపా శ్రేణులు బాయ్ కాట్ భోళా శంకర్, బాయ్ కాట్ మెగా హీరోస్ అంటూ హ్యాష్ ట్యాగులు సృష్టించి… వాటిని ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఓరకంగా మెగా హీరోలపై వాళ్లు యుద్దం ప్రకటించినట్టే లెక్క.
గోటితో పోయేదాన్ని వైకాపా ప్రభుత్వం గొడ్డలి వరకూ తెచ్చుకొంటోంది. చిరు సూచనల్ని విమర్శలుగా తీసుకొని తమ గోతులు తామే తవ్వుకొనే ప్రమాదానికి తెచ్చుకొంటోంది. భోళా శంకర్ మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్దంగా ఉంది. థియేటర్ల దగ్గర వైకాపా పార్టీ శ్రేణులు, ఆ పార్టీ కండువా భుజాన వేసుకొని, కార్తకర్తలమని చెప్పుకొనేవాళ్లూ… ఆందోళనకు దిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మెగా ఫ్యాన్స్ మొత్తం..రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వైకాపా శ్రేణులకు గట్టి సమాధానం చెబుతున్నాయి. `మా హీరోల జోలికొస్తే ఊరుకోం` అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. నిన్నా మొన్నటి వరకూ భోళా శంకర్‌కు పెద్ద హైప్ లేకుండా పోయింది. వైకాపా వాళ్లు ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకొనేలా చేస్తున్నారు. చిరు ఫ్యాన్స్ తమ బలం చూపించడం కోసం థియేటర్లకు ఎగబడితే – అది భోళా శంకర్‌కే ప్లస్సు. ఈ విషయం వైకాపా నేతలు మర్చిపోతున్నారు.