లవ్ స్టోరీలు ఎన్నిసార్లు చూసినా, ఫ్రెష్‌గానే కనిపిస్తాయి. కాకపోతే.. తీసే విధానం బాగుండాలి. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కొత్తగా ఉండాలి. కథలో సంఘర్షణ పాతదే అయినా, దాన్ని ఈతరానికి నచ్చేలా తీయగలగాలి. ఇవన్నీ `ఖుషి` ట్రైలర్లో పుష్కలంగా కనిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రమిది. శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబరు 1న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వదిలారు. కశ్మీర్ లో మొదలైన ఓ రొమాంటిక్ క్యూట్ స్టోరీ ఇది. బేగం.. బేగం అంటూ విజయ్ సమంత వెంట పడడం, వచ్చీ రాని హిందీలో తెలుగు మిక్స్ చేసి మాట్లాడడం, ఆ తరవాత సమంత బేగమ్ కాదు, బ్రాహ్మిణ్ అని అర్థమవ్వడం ఇవన్నీ సరదాగా, రొమాంటిక్ గా చూపించారు. `అది నా పిల్ల` అంటూ విజయ్ సమంతని ఉద్దేశించి అనడంలో `అర్జున్ రెడ్డి `టచ్ కనిపించింది. క్రిస్టియన్ అబ్బాయికీ, బ్రాహ్మిణ్ అమ్మాయికీ పెళ్లి జరిగితే, ఆ కాపురం ఎలా ఉంటుంది? వాళ్ల మధ్య ఈగోలు, గొడవలూ, గోలలూ ఎలా ఉంటాయి? ప్రేమించుకొనే సమయంలో ప్లస్సులు, ఆ తరవాత మైనస్పులుగా ఎలా మారతాయి? బెస్ట్ కపుల్‌గా ఉండాలని నిర్ణయించుకొన్న ఓ జంట.. ఆ తరవాత ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇదే ఈ సినిమా కథ. ట్రైలర్లో కూడా ఇదే చూపించారు. మొత్తానికి ట్రైలర్‌తోనే శివ నిర్వాణ కథంతా చెప్పేశాడు. విజయ్ ఎక్స్ప్రెషన్స్, సమంత లుక్స్ క్యూట్ గా ఉన్నాయి. విజువల్స్, ఆ కలర్స్ అన్నీ నీట్ గా ఉన్నాయి. పాటలు ఇప్పటికే హిట్టు. తెరపై అవి మరింత అందంగా వస్తే.. ట్రైలర్లో కనిపించిన మూడ్.. సినిమాలోనూ ఉంటే, విజయ్ ఖాతాలో మరో హిట్టు పడడం ఖాయం.