వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత జగన్ రెడ్డి అన్ని పథకాలను ఆపేసి వాటి స్థానంలో నగదు బదిలీ చేస్తున్నారు. చివరికి అభివృద్ధి పనులు కూడా నిలిపివేసి డబ్బులు పంచుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న సాయం అని.. ఇక తిరిగి ఇవ్వాల్సినవి కాదని అందరూ అనుకుంటున్నారు. నిజానికి ప్రభుత్వం తిరిగి ఇవ్వమని అడుగుతుందని ఎవరూ అనుకోరు. కానీ ప్రభుత్వ లెక్క మాత్రం వేరేగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అవన్నీ ప్రజలకు అప్పుగానే ఇచ్చినట్లుగా భావిస్తోందని చెబుతున్నారు. తిరిగి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. అంటే.. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారితే మళ్లీ చెల్లించాలని నోటీసులు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజల నుంచి ప్రామిసరీ నోట్ల సేకరణ !
ప్రస్తుతం లబ్దిదారుల నుంచి ప్రామిసరీ నోట్ల తరహాలో ఉన్న ఫార్మాట్లో తాము ప్రభుత్వం నుంచి ఇన్ని డబ్బులు తీసుకున్నామని… ప్రభుత్వనికి రుణపడి ఉంటామన్న అంగీకారం తెలుపుతున్నట్లుగా సంతకాల తీసుకుంటున్నారు. ఇలాంటి సంతకాల సేకరణ గుట్టుగా ప్రారంభమయింది. మామూలుగా అయితే ఇలా ఇంటింటికి వెళ్లి చేసే సేకరణ పనులకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. కానీ ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రచారం లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నారు. సంతకాలు తీసుకుంటున్నారు. ఇందులో ఉన్న మ్యాటర్ ను బట్టి… ప్రభుత్వం ఎలా అయినా అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వలేదన్న అర్థం మాత్రం అందులో స్పష్టంగా ఉంది.
మళ్లీ గెలిస్తే వసూలు పర్వానికే సన్నాహాలు !
ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. జీతాలివ్వాలన్న ఆర్బీఐ దగ్గరకు అప్పుల కోసం పరుగెత్తారు. విశాఖ సహా రాష్ట్రంలోని అత్యంత విలువైన ఆస్తులను తాకట్టుపెట్టారు. ఇప్పుడు తాకట్టు పెట్టడానికి కూడా ఆస్తులు మిగల్లేని పరిస్థితి. మరో వైపు అలవి మాలిన విధంగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి… ఉద్యోగుల జీత భత్యాలకు వచ్చే ఆదాయం సరిపోదు. ఎలాగోలా నెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా తర్వాత ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితి ఉండదు. ఒక్కటే మార్గం.. అదే మళ్లీ ప్రజల నుంచే వసూలు చేయడం.. అందుకే ప్రజలు ఎదురు తిరగకుండా ప్రామిసరి నోట్లు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.
లబ్దిదారులు అభివృద్ధి చెందారని తిరిగి వసూలు చేసే ప్రణాళిక !
రాష్ట్రంలో పథకాల అమలుకు అత్యంత కఠిన నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనల ప్రకారం.., పది శాతం మందికి కూడా పథకాలు అందవు. ఆ నిబంంధనల ప్రకారం అర్హులు కాకపోయినా పెద్ద ఎత్తున పథకాలు మంజూరు చేశారు. వారి వద్ద నుంచి తీసుకుంటున్న ప్రామిసరీ నోట్లను ముందు ముందు .. తాము ఇచ్చిన పథకాల వల్ల అభివృద్ధి చెందారని.. అందుకే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినందున చెల్లించాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ప్రామిసరీ నోటుతో కేసులు పెడతామని బెదిరించే అవకాశం కూడా ఉందన్న వాదన వినిపిస్తోంది.