Jailer movie telugu review
రేటింగ్: 3/5
‘అర్థమైందా రాజా..’ ఇప్పుడీ మాట సోషల్ మీడియాలో ఓ వైరల్ . అసలు ఈ మాటలో వైరల్ అవ్వదగ్గ మేటర్ ఏముందని అడిగితే.. రజనీ అనే మూడు అక్షరాల పేరు వినిపిస్తుంది. ఆయన నోట నుంచి మాటకి వున్న మ్యాజిక్ అది. మాటలకందని స్టార్ డమ్ తో సరిహద్దులని చెరిపేసిన స్టార్.. రజనీకాంత్. ఆయన వెండితెరపై కనిపిస్తే అదో కోలాహలం. అందుకే రజనీకాంత్ నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా.. సినిమాని అభిమానించే వారి ద్రుష్టి అటు పడుతుంది. ఇప్పుడు ‘జైలర్’పై కూడా అదే ఆసక్తి నెలకొంది. డార్క్ కామెడీ తీయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ క్యురియాసిటీని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కొనసాగిందా? రజనీని దిలీప్ ఎంత కొత్తగా చూపించాడు? జైలర్, రజనీ ఫ్యాన్స్ కోరుకునే విజయాన్ని అందించిందా?
ముత్తు అలియాస్ టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) రిటైర్డ్ జైలర్. ముత్తు.. భార్య (రమ్యకృష్ణ) కొడుకు అర్జున్ (వంసత్ రవి ) కోడలు (మిర్నా మీనన్) మనవడితో హాయిగా విశ్రాంత జీవితం గడుపుతుంటాడు. ముత్తు కొడుకు అర్జున్ ఏసీపీగా పని చేస్తుంటాడు. తను నిజాయితీ పరుడు. దేవాలయంలో విగ్రహాలు దొంగలించే ముఠా నాయకుడు వర్మ( వినాయక్). ఆ ముఠాని పట్టుకునే క్రమంలో అర్జున్ ప్రాణాలు కోల్పోతాడు. తను కొడుకుని చంపిన ముఠాపై ముత్తు ఎలా పగ తీర్చుకున్నాడు? ఈ క్రమంలో నరసింహా (శివరాజ్ కుమార్ ) మాథ్యూ (మోహన్ లాల్ )ముత్తుకి ఎలా సాయపడ్డారు? అనేది మిగతా కథ.
రజనీకాంత్ సినిమాలు ఒక మీటర్ లో సాగుతాయి. ఆయన్ని, ఆయన ఇమేజ్ ని శృతిమించి వాడేయాలనే ప్రయత్నం కూడా చాలా మంది దర్శకుల్లో కనిపిస్తుంది. అయితే జైలర్ దర్శకుడు నెల్సన్ మాత్రం దానికి భిన్నంగా అలోచించాడు. రజనీ ఇమేజ్, స్టయిల్, గ్రేస్ ని కావాల్సిన చోట వాడి డెబ్బై ఏళ్ల రజనీకాంత్ ఎలా వుంటారో ‘జైలర్’లో చూపించే ప్రయత్నం చేశారు. ఒక భారీ ఫైట్ తర్వాత ఇంట్రో సాంగ్ లాంటి రొటీన్ టెంప్లెట్ జోలికి వెళ్ళకుండా చాలా సెటిల్డ్ గా జైలర్ కథని మొదలుపెట్టాడు.
అరక్కోణంలోని ఓ గుళ్లో విగ్రహాల దొంగతనం, తర్వాత వర్మ ముఠా పరిచయం, తర్వాత రజనీ ముత్తు పాత్రని పరిచయం చేశాడు. రజనీ పరిచయం తర్వాత కూడా కథ ఒకటో గేర్ లోనే వెళుతుంటుంది. నెల్సన్ ప్రత్యేకత తాను చెప్పబోయే కథలోని ప్రపంచం అక్కడి పాత్రలని నిదానంగా పరిచయం చేయడం. జైలర్ కూడా అదే ఫాలో అయ్యాడు. ఎప్పుడైతే అర్జున్ కనిపించకుండా పోతాడో అప్పటి నుంచి కథలో సీరియస్ నెస్, డార్క్ కామెడీ గేర్లు మార్చుకుంటాయి. ఇక ఆ పాత్రలు వినోదం పంచడం మొదలుపెడతాయి. యోగి బాబు, రజనీకి మధ్య వచ్చే సీన్లు అంత సీరియస్ లో కూడా ఫన్ ని అందిస్తాయి. అలాగే శివన్న పాత్ర ఎంట్రీ, ఆయన పంపిన స్నిపర్ షూటర్స్ ని ఇంటర్వెల్ బాంగ్ లో వాడుకున్న విధానం వావ్ అనిపిస్తుంది.రజనీకాంత్ కి వున్న ఇమేజ్ కి ఆయన లేచి ఫైట్స్ చేయాల్సిన అవసరం లేదు. కనుసైగతో యుద్దం చేయొచ్చు. నెల్సన్ దాన్ని బలంగా నమ్మాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఆయన కూర్చుని కేవలం కను సైగలతో చేసిన విధ్వంసం చూసి తీరాల్సిందే. ఈ ఇంటర్వెల్ బాంగ్ సెకండ్ హాఫ్ పైఅంచనాలని అమాంతం పెంచేస్తుంది.
అయితే.. ద్వితీయార్థంలో అంచనాలు తప్పేశాయి. సెకండ హాఫ్ ఆరంభంలోనే జైలర్ కి సడన్ బ్రేక్ పడినట్లయింది. రజనీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కేవలం ఒకే సీన్ తో సరిపెట్టినప్పటికీ దాన్ని సాగదీసినట్లుగా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయిన తర్వాత జైలర్ మళ్ళీ ట్రాక్ ఎక్కుతాడని భావిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు నెల్సన్ నిరాశ పరిచాడు. ఎప్పుడైతే కిరీటం దొంగతనం డ్రామా మొదలౌతుందో .. అక్కడి నుంచి జైలర్ గ్రాఫ్ పడిపోతుంది. కథ మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందిపోవడమే కాదు సిల్లీగా అనిపిస్తుంది. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ జాతీయ ఆస్తిని దొంగతం చేసి ఓ ముఠాకి ఇవ్వడని ఎవరికైనా అర్ధమౌతుంది. అదే ఫేక్ డ్రామాపై సెకండ్ అంతా ఆధారపడిపోయాడు దర్శకుడు.
సునీల్, తమన్నా, సినిమా సెట్టింగ్ నేపధ్యంలో వచ్చిన కొన్ని కామెడీ సీన్స్ ఏ మాత్రం రక్తి కట్టించలేదు. అక్కడి నుంచి సినిమా మరీ ఫ్లాట్ అయిపోయింది. ఆ కిరీటం కోసం ఇంత డ్రామా, యాక్షన్ అవసరమా? అనిపిస్తుంది. అర్జున్ పాత్రలో ఒక ట్విస్ట్ వుంది అది సరిపొతుందనేది దర్శకుడి అభిప్రాయం కావచ్చు. కానీ ఆ ట్విస్ట్ శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ ని మళ్ళీ తెరపైకి తీసుకురావడానికి పనికొచ్చింది కానీ జైలర్ కథకు న్యాయం చేయలేకపోయింది.
జైలర్ పాత్రలో రజనీ కొత్తగా కనిపిస్తారు. వయసుకు తగ్గ పాత్ర. రజనీ గ్రేస్ స్టయిల్ మేనరిజమ్స్ అన్నీ వాడుకున్నాడు దర్శకుడు. ఐతే ఆ వాడుకునే విధానంలో సహజత్వం వుంది. ఏదీ శ్రుతిమించినట్లు అనిపించదు. ఇంటర్వెల్ బాంగ్ లో రజనీ స్టయిల్ వింటేజ్ రజనీ గుర్తు చేస్తుంది. క్లైమాక్స్ లో సిగర్ ని కాల్చిన విధానం వావ్ అనిపిస్తుంది. అగ్గిపుల్లనే కాదు అగ్గిపెట్టిని కూడా స్టయిల్ గా త్రో చేసిన విధానం రజనీకే చెల్లింది. సిగర్ ని కాలుస్తూ దాన్ని కిందకు పైకి అంటారు. అదొక కమాండ్ లా భావించి విలన్ ని కిందకిపై కి వ్రేలాడిదీస్తారు. ఇది మాస్ కి పరాకాష్ట. రజనీ భార్య పాత్రలో చేసిన రమ్యకృష్ణ హుందాగా కనిపించారు. తమన్నాది గెస్ట్ రోల్. ఆ పాట కలర్ ఫుల్ గా వుంది. బ్లాస్ట్ మోహన్ గా సునీల్ పాత్ర పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అర్జున్ పాత్రలో వసంత్ రవి బాగానే చేశాడు. మిర్నా మీనన్ ఓకే అనిపిస్తుంది. యోగి బాబు మరోసారి నవ్వించాడు. పెద్దాయన మాట అంటూ ఆయన చెప్పిన డైలాగులు పేలాయి. విలన్ పాత్రలో నటించిన వినాయకన్ కి మంచి మార్కులు పడతాయి. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు రజనీతో కలిసి కనిపించడం అన్ని పరిశ్రమల ప్రేక్షకులకు ఒక పండగే.
అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ జైలర్ కు పెద్ద బలం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. `ఉరుముకి మెరుపుకి పుట్టాడురా` పాటని బ్యాక్ గ్రౌండ్ లో వాడుకోవడం బావుంది. ప్రతి బీజియమ్స్ హై వోల్టేజ్ లో చేశాడు. కెమరా పనితనం ఎడిటింగ్ డీసెంట్ గా వున్నాయి. దర్శకుడు నెల్సన్ మరోసారి తన డార్క్ కామెడీ మార్క్ ని చూపించాడు. ఐతే ఇది ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్ లో కూడా ఫస్ట్ హాఫ్ మ్యాజిక్ జరిగుంటే జైలర్ రిజల్ట్ మరో స్థాయిలో వుండేది.
రేటింగ్: 3/5