గత ఎన్నికలకు ముందు సాక్షి టీవీతో కలిసి ప్రోగ్రాములు చేసి.. పవన్ పై కొన్ని దారుణమైన ఆరోపణలు చేసిన ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సారి మాత్రం పుల్ సపోర్ట్ ప్రకటించారు. ఎప్పుడూ లేని విధంగా ఇన్‌స్టాలో వీడియో పెట్టి… రాజకీయంగా కచ్చితంగా తన మద్దతు పవన్ కల్యాణ్ కే ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ పేదల కోసమే ఆలోచిస్తారని, ఆయన అస్సలు డబ్బుల మనిషి కాదని అన్నారు.
‘‘ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమా తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. నేను ఇన్ని రోజులు విదేశంలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు స్పందిస్తున్నాను. నా మాజీ భర్త గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు తీస్తామని అంటున్నారు. నేను ఓ తల్లిగా అందరికీ ఒకటే కోరుతున్నాను. మీ ప్రొఫెషన్లోకి దయచేసి పిల్లల్ని లాగకండి. వాళ్లకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఒక తల్లిగా నేను అభిమానుల్ని, ప్రత్యర్థుల్ని, రాజకీయ నాయకుల్ని వేడుకుంటున్నాను. దయచేసి పిల్లల్ని, కుటుంబంలోని ఆడవారిని రాజకీయాల్లోకి లాగకండి. “అని విజ్ఞప్తి చేశారు.
నేను మొదటి నుంచి రాజకీయాల పరంగా నా మాజీ భర్తను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటానని రేణు దేశాయ్ స్పష్టం చేసింది. తాను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే.. పవన్ కల్యాణ్ జనం కోసమే ఉంటారు. ఆయన డబ్బు మనిషి కాదు. డబ్బు అంటే ఇంట్రెస్ట్ లేదు. సమాజానికి మంచి చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత ఇబ్బందుల్ని పక్కన పెట్టి, కచ్చితంగా రాజకీయంగా సపోర్ట్ చేస్తానని రేణు ప్రకటించారు. మాజీ భార్యగా మాట్లాడడం లేదు. సమాజంలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దయచేసి మూడు పెళ్లిళ్ల గురించి చర్చను ఆపాలని విపక్ష నేతల్ని కోరారు.
అయితే రేణు దేశాయ్ గత ఎన్నికలకు ముందు సాక్షి టీవీకి.. ఇంటర్యూకు ఇవ్వకపోయి ఉంటే.. అప్పుడే ఇలాంటి సమాధానం చెప్పి ఉంటే చాలా మంది నోళ్లు మూతపడి ఉండేవని పవన్ అభిమానుల అభిప్రాయం.