కోకాపేటలో ఎకరం వంద కోట్లు పలికింది .. అదే ఉత్సాహంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల వేలానికి చేసిన ప్రయత్నాలు ఆ రేంజ్లో సక్సెస్ కావడం లేదు. ప్రతీ రోజూ ఎక్కడో చోట భూమల వేలం వేస్తూనే ఉన్నారు. నిన్న మోకిలాలో చిన్న ప్లాట్లను వేలం వేయగా.. ఇవాళ బుద్వేలులో ఎకరాల కొద్దీ ఉన్న ప్లాట్లను వేలం వేలం వేశారు. కనీస ధరను ఇరవై కోట్లుగా నిర్ణయించారు. కానీ అనకున్నంతగా భూమ్ కనిపించలేదు. కోకాపేటలో ల్యాండ్స్ కొన్న రియల్ ఎస్టేట్ సంస్థలు బుద్వేలుపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్దగా కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపించలేదు.
ఔటర్ రింగ్ రోడ్డు రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ దాదాపు 182 ఎకరాల్లో బుద్వేల్ లే అవుట్ ప్లాట్లను అభివృద్ధి చేసింది. ఇక్కడి లే అవుట్ లో ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు, గరిష్టంగా 14.3 ఎకరాలు. భారీ ల్యాండ్స్ కావడంతో అత్యంత ఎత్తయిన అపార్టుమెంట్లు కట్టడానికి అనువైన ప్రాంతం. అందుకే రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి భారీగా డిమాండ్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఆశించినంతగా లేదు.
అన్ని ప్లాట్లకు ఏ ఒక్క ఎకరానికి కూడా యాభై కోట్లు ధర పలకలేదు. ప్రభుత్వం ఊహించినంత నిధులు బుద్వేలు వేలం ద్వారా రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల స్క్రీములకు నిధులను సమీకరించుకునేందుకు భూముల వేలానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. కోకాపేట భూములతో నిధుల సమీకరణపై ఆశలు రేగినా.. బుద్వేలు విషయంలో అనుకున్నంత రాకపోవడం ఇబ్బందికరంగానే మారుతోంది.