జగన్ మోహన్ రెడ్డి సీఎం కాదని.. ఓ అవినీతి వ్యాపారి.. ప్రతి పనీలోనూ వాటా అడిగే డబ్బు పిచ్చి ఆయనదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. విశాఖలో వారాహియాత్ర నేటి నుంచి ప్రారంభమయింది. జగదాంబ సెంటర్‌లో ఆయన బహిరంగసభకు పెద్ద ఎత్తున జనసైనికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మరోసారి జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. చాలా ప్రశాంతమైన నగరం విశాఖ ఈరోజు.. గూండాలు, కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ రాబంధుల చేతుల్లో చిక్కకుని విలవిల్లాడుతోందన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్ మద్దతుదారులందరి జాబితా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. దోపిడీదారుల బండారం బయటపడే రోజు దగ్గర్లోనే ఉంది. జగన్.. కేంద్రం చేత నిన్ను ఆటాడించకపోతే చూడు అని హె్చచరించారు.
కేవలం లిక్కర్ అమ్మకాల ద్వారా సీఎం జగన్ 30 వేల కోట్లు సంపాదించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జగన్ సొంత లిక్కర్ తయారీ కంపెనీలు పెట్టుకుని కోట్లు కొల్లగొట్టారని, వాటి ద్వారా ప్రజల ఓట్లు కొనేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సారా కొట్టు నుంచి సిమెంట్ పరిశ్రమ దాకా అన్నీ జగన్ కిందే ఉన్నాయన్నారు. రుషికొండ జగన్ దేనని, మేఘా అనే సంస్థ జగన్ దేనని అన్నారు. ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదని, ఎవరు పచ్చగా ఉండకూడదని, ఎవరూ తెల్లదుస్తులు ధరించరాదనే మనస్తత్వం జగన్ సొంతమన్నారు.
ప్రజలు బాగా పరిపాలించమని అధికారం ఇస్తే జగన్ మాత్రం ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని, ఒక్క కులంతోనే పదవులు ఇస్తున్నారని, రూలింగ్ కాస్ట్ వ్యవస్థకు తాను వ్యతిరేకమని పవన్ అన్నారు. తాము పాలించడానికే ఉన్నామని జగన్ భావిస్తున్నారని, ఇతర కులాలు పాలించబడడానికే ఉన్నారనే ధోరణిలో జగన్ రెడ్డి ఉన్నారని పవన్ విమర్శించారు. అందుకు తాను, జనసేన వ్యతిరేకమన్నారు. కీలకమైన పదవులు అన్నీ ఒకే కులానికి అప్పగిస్తున్నారని, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన వారు కులానికి కట్టుబడి ఉంటున్నారని మండిపడ్డారు.
జనసేన ర్యాలీకి పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టినా.. వారాహి యాత్ర సాఫీగా సాగిపోయేలా చేయడంలో జనసేన నేతలు కష్టపడ్డారు. పవన్ కల్యాణ్ జగదాంబ సెంటర్ లో సభ పెడితే ఎలా ఉంటుందో జనసేన చూపించినట్లయింది.