ప్రభుత్వ ఉద్యోగుల కేటగరిలో పోలీసులు కూడా వస్తారు. కానీ పోలీసుల బాధ్యత లు మాత్రం భిన్నంగా ఉంటాయి. వారు ఎంత గట్టిగా చట్టం, న్యాయం కోసం నిలబడితే ప్రజల జీవితాలు అంత సాఫీగా సాగుతాయి. వారి వ్యవస్థ కుళ్లిపోతే సమాజం అశాంతికి లోనవుతుంది. అదే జరిగితే నష్టపోయేది వ్యక్తులు కాదు .. సమాజం, దేశం.
నేరస్తులకు అండ – అమాయకులపై యుద్ధం
ఏపీలో ప్రతీ రోజు వెలుగులోకి వస్తున్న అరాచకాలు చూస్తూంటే… ప్రజల జీవితాల్ని ఇంత రిస్క్‌లో పెట్టి పోలీసు వ్యవస్థ ఏం బావుకుంటుందనేది ఎవరికీ అర్థం కాదు. చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతోంది. రాజకీయకారణాలతో నిందితుల్ని వదిలేసతున్నారు. తప్పు చేయని వారిని కేసుల్లో ఇరికిస్తున్నారు. అంత కంటే దౌర్భాగ్యం ఏమిటంటే.. తమ సొంత డిపార్టుమెంట్ కు చెందిన వారిపై రాజకీయనేతలుదాడి చేసి కుక్కల్ని కొట్టినట్లుగా కొడుతున్నా.. తుడిచేసుకుని పోతూండటం… పోలీసు వ్యవస్థ ఎంత బలహీన స్థితికి చేరిపోయిందో వెల్లడయ్యే నిదర్శనం.
పోలీసుల్ని కొట్టినా ఏమీ చేయలేని చేతకానితనం
మొన్న అనంతపురంలో మహిళా కానిస్టేబుల్‌పై వైసీపీ నేత చేసిన దాష్టీకం చూసిన తర్వాత సామాన్యులు ఎవరికైనా ఇక పోలీసులు తమకు న్యాయం చేయగలరు అనే నమ్మకానికి వస్తారా ? నిన్నటికి నిన్న చీరాలలో వైసీపీలోని రెండు వర్గాల ఘర్షణలో ఓ మహిళా కానిస్టేబుల్ తల బద్దలు కొట్టారు… కర్నూలులో మరో కానిస్టేబుల్ గొంతు కోసి చంపారు. కానీ ఎవరి పైనా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. కానీ రాజకీయ పరమైన కేసుల్లో… ప్రజాస్వామ్య యుతంగా ఉద్యమాలు చేసే వారిపైనా ప్రతాపం చూపిస్తున్నారు. దిష్టిబొమ్మ తగుబెడితే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇదంతా చేయడం ఎవరి కోసం..? . నేర మనస్థత్వం ఉన్న వారి కోసం.. పోలీసు వ్యవస్థని నేరాల్లో భాగం చేయడం దేశానికి మంచి చేసినట్లేనా?
ప్రజల సానుభూతి కోల్పోతున్న పోలీసులు
పోలీసులు ప్రజల సానుభూతి పూర్తిగా కోల్పోతున్నారు. వారు చేస్తున్న చేష్టలతో పోలీసులు అంటే.. భయపడే పరిస్థితి వచ్చింది. గతంలో భయపడేవారు….కానీ నేరస్తులు భయపడేవారు. ఇప్పుడు నేరస్తులు ధైర్యంగా ఉంటున్నారు. సామాన్యులు భయపడిపోతున్నారు. ఇలాంటి వాతావరణం అసలు ద్రోహం. అందుకే పోలీసులు ఎక్కడైనా ఆపదలో ఉన్నారంటే సాయం చేయడానికి ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రావడం లేదు. దానికి సాక్ష్యం… అనంతపురం జిల్లాలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.
పోలీసులు తెలుసుకోవాల్సింది ఒక్కటే.. వ్యవస్థను కాపాడితే అది మిమ్మల్నే కాదు.. ప్రజల్ని..రాష్ట్రాన్ని.. దేశాన్ని కాపాడుతుంది. నేరస్తులకు అండగా ఉంటే.. ప్రజలకు..దేశానికి ముప్పు తెచ్చి పెట్టినట్లే.