కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే దాన్ని సమర్థించడానికి ప్రయత్నిస్తే పై స్థాయి అధికారులు కూడా ఇరుక్కుపోతారు. తప్పు చేశారని నిజం తెలిసినా దాచి పెట్టి ఓ వ్యక్తిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైనా కేసు నమోదయింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అఫిడవిట్ ను ట్యాంపర్ చేసిన ఘటనలో సీఈసీపైనా కేసు నమోదు అయింది. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతోంది.
2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తో పాటు అఫిడవిట్ ను సమర్పించారు. వాటిని ఈసీ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసింది. తర్వాత ఆ అఫిడవిట్ మారిపోయింది. పాతది డిలీట్ చేసి కొత్తది అప్ లోడ్ చేశారు. ఇలా ట్యాంలింగ్ చేయడపై ఫిర్యాదు చేస్తూ మహబూబ్నగర్ జిల్లాకే చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు హైదరాబాద్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. మహబూబ్ నగర్ పోలీసులు కోర్టు ఆదేశాల ప్రకారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయకపోవడంతో మంత్రి నుండి మంత్రి అనుచరుల నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదు చేస్తూ రాఘవేంద్ర రాజు ఇటీవల మరోసారి కోర్టును ఆశ్రయించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తాము ఆదేశించిన విధంగా మరో 10 మంది అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు వివరాలు సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు తీర్పు ఉల్లంఘన కింద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తూ మహబూబ్ నగర్ పోలీసులపై కోర్టు మొట్టికాయలేసింది. దీంతో ఆలస్యంగా తేరుకున్న పోలీసులు ఇక చేసేదేం లేదన్నట్టుగా మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో పది మంది అధికారులపై కేసు నమోదు చేసి ఆ వివరాలను కోర్టుకు అందజేశారు. ఈ పది మందిలో సీఈసీ కూడా ఉన్నారు.
ఇది చాలాసీరియస్ కేసు.. పై స్థాయి వాళ్లంతా ఇరుక్కునే ప్రమాదం ఉండటంతో.. ఈ కేసులో పోరాడుతున్న రాఘవేందర్ రాజు పై … హత్య కు కుట్ర కేసులు కూడా పెట్టారు. ఈ వ్యవహారంలో సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న స్టీఫెన్ రవీంద్రపైనా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడీ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుదో కానీ సంచలనం సృష్టించడం ఖాయమన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది.