గన్నవరం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి వంశీని ఓడించినంత పని చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు. జగన్ రెడ్డి తనను అమెరికా నుంచి తీసుకు వచ్చి నడి రోడ్డుపై వదిలేశారని ఆయన ఫైర్ అవుతున్నారు. వంశీతో ఆయనకు తీవ్రమైన శత్రుత్వం ఏర్పడటంతో ఇక ఆ పార్టీలో కొనసాగే ప్రశ్నే లేదని అంటున్నారు. వంశీకి ఎలా సీటిస్తారని.. ఆయనను పార్టీలో చేర్చుకుని తనను అవమానించారని యార్లగడ్డ ఫీలవుతున్నారు.
కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఆయన ఇటీవల టీడీపీతో చర్చలు జరిపి.. గన్నవరంలో పార్టీలో చేరేందుకు డిసైడ్ కావడంతో సీన్ మారిపోయింది. యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టబోతోంది. ఆ పాదయాత్రలోనే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరుతారని అంటున్నారు. గన్నవరం లో టీడీపీ క్యాడర్ లో సగం మంది వంశీతోనే ఉన్నారు. టీడీపీకి ఇప్పటి వరకూ సరైన నేత లేరు. ఇంచార్జ్ గా ఉన్న బచ్చున అర్జునుడు కన్ను మూశారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. గట్టి నేత వస్తే క్యాడర్ అంతా వెనక్కి వస్తారని అంటున్నారు.
మరో వైపు వంశీ పట్ల వైసీపీ క్యాడర్ తీవ్ర వ్యతిరేకతతో ఉంది. ఆయను ఎవరూ అంగీకరించలేకపోతున్నారు. మరో నేత దుట్టా రామచంద్రరావు కూడా వంశీకి టిక్కెట్ ఇస్తే సహకరించబోమని చెబుతున్నారు. ఆయన తన అల్లుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తంగా వంశీ.. అటు వైసీపీ వాళ్ల అభిమానం పొందలేదు.. ఇటు సంప్రదాయ టీడీపీ మద్దతుదారులను తన వైపు తిప్పుకోలేక… మొదటికే బేస్ కోల్పోయే పరిస్థితికి వస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.