ప్రాజెక్ట్ కె (కల్కి) మరిన్ని హంగులు సంతరించుకొంటోంది. ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి హేమా హేమీలు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకొన్నారు. ఈ సినిమాలో మరింత మంది స్టార్లు కనిపించనున్నారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఓ కీలక పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ సైతం ఈ టీమ్ లో చేరాడని సమాచారం.
సీతారామం చిత్రాన్ని వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దుల్కర్ తెలుగులో నేరుగా చేసిన తొలి సినిమా ఇది. సీతారామం మంచి హిట్ అయ్యింది. దుల్కర్‌ని టాలీవుడ్ ఘనమైన రీతిలో స్వాగతం పలికింది. ఈ సినిమాతో వైజయంతీ మూవీస్ తో దుల్కర్ కు మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే ఈ సినిమాలోనూ తనకు ఓ కీలకమైన పాత్రని కట్టబెట్టినట్టు సమాచారం. దుల్కర్ నటించిన `కింగ్ ఆఫ్ కోత` ఈనెలలోనే విడుదల కాబోతోంది. ఈసినిమా ప్రమోషన్లలో దుల్కర్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా `ప్రాజెక్ట్ కె` ప్రస్తావన వచ్చింది. ప్రాజెక్ట్ కెలో మీరు ఉన్నారా? అని అడిగితే, ఈ ప్రశ్నకు దుల్కర్ నేరుగా సమాధానం చెప్పలేదు. “ఈ విషయం గురించి నేను మాట్లాడకూడదు. చిత్రబృందమే చెప్పాలి. కాకపోతే.. ప్రాజెక్ట్ కె వేరే లెవల్లో ఉండబోతోంది. ఆ ఐడియా.. నాగ అశ్విన్ కి తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు“ అనేశాడు. కథ గురించి, అందులోని స్పెషాలిటీ గురించీ నాగ అశ్విన్ గురించీ మాట్లాడగలిగాడంటే… కచ్చితంగా ఈ టీమ్ లో దుల్కర్ ఉన్నట్టే అనుకోవాలి.