జగన్ రెడ్డి పేద పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారు. ప్రయోగాలు చేస్తూ.. వారికి ఏదీ రాకుండా చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం పేరుతో బలవంతంగా తెలుగు మీడియం రద్దు చేసి లక్షల మంది చదువు మధ్యలో ఆగిపోయేలా.. పాస్ పర్సంటేజీ తగ్గిపోయేలా చేశారు. ఈ ఘోరాలను ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తర్వాత బైజూస్ అన్నారు. తర్వాత సీబీఎస్ఈ అన్నారు. ఇంకా సీబీఎస్ఈ ను పూర్తిగా అమలు చేయకుండానే.. ఇప్పుడు ఐబీ అని.. ఎక్కడో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంగ్లిష్ మాతృభాషగా ఉండే దేశాల్లో ఉండే కరికులం తెచ్చి రుద్దేస్తున్నారు. ఏకంగా ఒప్పందాలే చేసుకుంటున్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ తెస్తామని ప్రకటించారు. బైజూస్ తో ఇప్పటికే పెట్టాల్సిన తిప్పలన్నీ పెడుతున్నారు. ఇక స్టేట్ బోర్డు అనేది లేకుండా మొత్తం సీబీఎస్ఈని చేసేస్తాని ఇప్పటికే ప్రకటించారు. కానీ అడుగులు ముందుకు పడటం లేదు. కానీ.. ఏకంగా ఐబీ కరికులం తెస్తామని ప్రకటించేశారు.
ఐబీ కరికులం అంటే.. ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ . స్విట్టర్జ్లాండ్కు చెందిన కొంత మంది టీచర్స్ తయారు చేసిన ప్రత్యేకమైన కరికులం ఇందులో ఉంటుంది. ఇదంతా ప్రాక్టికల్ విద్య. పరీక్షలు అనేవి ఉండవు. ర్యాంకులు, మార్కుల గొడవ ఉండదు. ఇది ఇండియాలో ముఖ్యంగా ఏపీలో ఎలా వర్తింప చేయగలరో.. జగన్ చెప్పాల్సి ఉంటుంది. కానీ రాసిచ్చింది చదివే ఆయనకు దీని గురించి అవగాహన ఉండే అవకాశం లేదు.
ఐబీ కరికులం కేవలం ఓ ప్రత్యేకమైన వ్యవస్థలోనే ఇముడుతాయి. గవర్మెంట్ స్కూళ్లకు అసలు సరిపడవు. అలాంటి పరిస్థితికి రావాలంటే.. దేశం.. విద్యావ్యవస్థ ఎంతో ముందుకు వెళ్లాల్సిఉంటుంది. నాలుగేళ్లలో ఒక్క టీచర్నీ నియమించని జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ స్టాండర్డ్ రావాలంటే కనీసం వందేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఒప్పందాలు మాత్రం చేసేసుకుంటున్నారు. పిల్లల జీవితాల్ని రిస్కులో పెట్టడానికి సిద్ధమవుతున్నారు.