జగన్ రెడ్డి బంధువు, వైసీపీని వీడి పోతానని బెదిరిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మైండ్ గేమ్ ప్రారంభించారు. పంద్రాగస్టు రోజు మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఒంగోలు అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. తానే కాదు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేశారు. ఇలా చెప్పడానిక ఆయన ఎందుకు అంత తొందరపడ్డారో కానీ.. జగన్ పై మైండ్ గేమ్ ప్రారంభించారని వైసీపీలో చర్చ జరుగుతోంది.
బాలినేని శ్రీనివాసరెడ్డి… తనను జగన్ నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తిలో ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి తనను టార్గెట్ చేయడంతో ఆయన ఇతర బాధ్యతల్ని వదులుకున్నారు. పార్టీ పేరు కూడా పరిమితంగా వాడుతున్నారు. గతంలో తన స్థానంలో తన భార్య పోటీ చేయవచ్చునని.. మరొకరు పోటీ చేయవచ్చునని.. తనకుమారుడి సీటివ్వాలని అడిగినట్లుగా రకరకాలుగా చెప్పారు. తనకు కూడా టిక్కెట్ గ్యారంటీ లేదన్నారు. అయితే ఇప్పుడు మాత్రం సీటు ప్రకటించేసుకున్నారు. ఇక మాగుంట శ్రీనివాసులరెడ్డి తాను ఇక పోటీ చేయనని తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించారు. ఆయనకుమారుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని ఇటీవలే బెయిల్ పై వచ్చారు. ఆయన వైసీపీ కార్యక్రమాల్లో అంత చురుకుగా లేరు.
మరో వైపు బాలినేనిని … టీడీపీ అసలు టార్గెట్ చేయడం లేదు. దీంతో ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ టీడీపీ తరపున ఆయనేనని ప్రచారం ఊపందుకుంది. అయితే దీన్ని బాలినేని కొట్టిపడేస్తున్నారు. ఇతరులు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు. కానీ.. జగన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నది వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీటీడీ చైర్మన్ పదవి కూడా పోవడంతో ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ సీటు మీద కన్నేశారు.