నారా లోకేష్ యువగళం పాదయాత్ర తాను పోటీ చేయబోయే మంగళగిరి నియోజకవర్గానికి చేరింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన దగ్గర నుంచి లోకేష్ నియోజకవర్గంలో ప్రణాళికాబద్దంగా పని చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రభావం పాదయాత్రలో కనిపించింది. అధికార బలంతో నియోజకవర్గ స్థాయినేతల్ని జగన్ రెడ్డి ఆశ పెట్టి తన పార్టీలో చేర్చుకున్నా.. వైసీపీకి మైనస్సే అయింది కానీ.. టీడీపీకి జరిగిన నష్టం ఏమీ లేదు. ఇంకా మేలు జరిగింది. పార్టీలో వర్గ పోరాటం అనేది లేకుండా పోయింది. ఫలితంగా వైసీపీ నుంచి వచ్చి చేరే వారు పెరిగిపోయారు.
మంగళగిరి నియోజకవర్గంలో రెండు లక్షలకుపైగా ఓటర్లు ఉంటారు. యువగళం పాదయాత్ర.. మంగళగిరికి చేరిన సందర్భంలో.. కనీసం 70వేల మంది ఆయనకు దారి పొడుగుతా స్వాగతం చెప్పి ఉంటారని అంచనా. గుంటూరు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన వారు ఇరవై వేల మంది వచ్చి ఉన్నా…. మంగళగిరి ఓటర్లు యాభై వేల మంది లోకేష్ తో పాదం కలిపారు. వచ్చిన జన సందోహం కారణంగా పాదయాత్ర మూడు, నాలుగు కిలోమీటర్లకే ఆరున్నర గంటల పాటు సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న లోకేష్ కు మంగళగిరి ప్రజలకు తమ వంతుగా నైతిక మద్దతు అందించారు.
మంగళగిరిలో గత ఎన్నికలలో గెలవకపోయినా లోకేష్.. ప్రజల్ని అంటి పెట్టుకుని ఉన్నారు. ప్రత్యేక వ్యూహం ద్వారా వైసీపీకి పట్టు ఉన్న గ్రామాల్లోనూ చొచ్చుకెళ్లారు. అదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్క పని చేయలేకపోవడం మైనస్ గా మారింది. పార్టీ నేతలమధ్య ఆధిపత్య పోరాటంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం… వారిలో ఓ వర్గం వైపు ఆళ్ల ఉండటంతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఆయనకు టిక్కెట్ లేదని తేలడంతో .. పట్టించుకోవడం మానేశారు. టీడీపీ నేత గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకున్నారు. టిక్కెట్ ఇస్తామని హమీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సరిపోరని.. బయట నుంచి ఎవరినైనా తెచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారు.
మంగళగిరిలో లోకేష్ జోరు కు.. ఎలా అడ్డుకట్ట వేయాలో ఐ ప్యాక్ టీమ్‌కూ అర్థం కావడం లేదు. కుల, మతాల చిచ్చు రాజకీయాల్లోనూ ఫలితం ఉండటం లేదు . రాజకీయం కాదు.. మంచి చేసి.. ప్రజల మన్ననలు పొందాలన్న లక్ష్యంతో లోకేష్ చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తోందని టీడీపీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.