కొంత మంది పోలీసులు బీఆర్ఎస్ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.. వారందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాం.. కాంగ్రెస్ రాగానే గుడ్డలిప్పదీస్తం. అసలు, మిత్తీతోని చెల్లిస్తం అని రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్‌లో చేసిన హెచ్చరికలపై పోలీసులు అధికారుల సంఘం నేతలు చెలరేగిపోతున్నారు. ఊరూవాడా ప్రతి పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేస్తున్నారు. తమ మనోభావాలను రేవంత్ రెడ్డి దెబ్బ తీశారని వారి అభియోగం.
పోలీసుల మనోభావాలు దెబ్బతీసిన రేవంత్‌రెడ్డి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. క్ష మాపణలు చెప్పకపోవడంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. ఏపీలోనే అనుకుంటే… తెలంగాణ పోలీసు సంఘాలు కూడా రాజకీయంగా యాక్టివ్ అయ్యాయి. పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తున్నాయి.
‘రెడ్ డైరీ’ అంటే ఏమిటి? అదేమన్నా మీ సొంత రాజ్యాంగమా? .. పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో అంతర్భాగమని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శాంతి భద్రతలను కాపాడతామని చెబుతున్నారు. బీఆర్ఎస్ తో కలిసి పోలీసులు పని చేస్తున్నారన్నదానికి వారు టీ పీసీసీ అధ్యక్షునిపై పెడుతున్న కేసులే సాక్ష్యమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి అందరు పోలీసుల్ని అనలేదని.. బీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్ నేతలపై కుట్రలు చేస్తున్న వారిని మత్రమే అంటున్నామని చెబుతున్నారు. మొత్తంగా పోలీసులు వర్సెస్ రేవంత్ అన్నట్లుగా తెలంగాణ రాజకీయం మారిపోయింది.