తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చని రాజకీయ పార్టీలు హడావుడి పడిపోతున్నాయి. ముందే ఈ సారి ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందని రాజకీయ పార్టీలన్నీ గట్టిగా నమ్ముతున్నాయి. సెప్టెంబర్ లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అక్టోబర్లో పోలింగ్ ఉటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నేతలకు చెప్పారు. ఆ ప్రకారం ఎన్నికలకు సిద్ధమవ్వాలన్న సంకేతాలు కూడా పంపారు. అయితే ఒక్క కేటీఆర్ కే ఇలాంటి కాన్ఫిడెన్షియల్ సమాచారం అందిందా లేకపోతే.. పార్టీ నేతలు రిలాక్స్ కాకుండా అలా చెప్పారా అన్నది మాత్రం ఎవరిక తెలియదు.
కానీ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చూస్తూంటే.. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వస్తుందన్నట్లుగా చేస్తున్నారు. పథకాలను శరవేగంగా ప్రారంభించేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కోడ్ అడ్డంకి రాకుండా ఉండటానికి అది పాత పథకం అని వాదించడానికి అవకాశం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులపై కసరత్తు ఓ రేంజ్ లో చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బ్యాక్ ఎండ్ లో అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసుకున్నారని చెబుతున్నారు. దరఖాస్తులు అన్నీ ఫార్మలిటీనేనని చెబుతున్నారు. మరో వైపు భారతీయ జనతా పార్టీ కూడా హై అలర్ట్ లో ఉంది. పార్టీ ముఖ్య నేతలందర్నీ.. . హైకమండ్ ఢిల్లీ పిలిపించింది. ఎన్నికలు ముందే వస్తాయని … ఏం చేయాలో చెప్పి పంపే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు పదవి కాలం జనవరి రెండో వారంతో ముగుస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలలకు మందుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి నిర్వహించవచ్చు. ఆ ప్రకారం చూసుకుంటే.. ఇప్పుడు ఈసీకి ఎన్నికిల షెడ్యూల్ ఇవ్వడానికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు.. ఇతర కారణాలను చెప్పి.. ముందే నిర్వహించవచ్చు. ముందే నిర్వహించినా.. పాత అసెంబ్లీల పదవి కాలం జనవరి వరకూ ఉంటుంది. కానీ అధికార పార్టీ గెలిస్తే సమస్య ఉండదు.. కానీ ఓడిపోతే మాత్రం ప్రజాదరణ కోల్పోయినందున ముందే రాజీనామా చేయాల్సి వస్తుంది.