ప్రపంచంలో ఎక్కడా లేని వింత రాజకీయాలు ఏపీలోనే జరుగుతుంటాయి. 2024 ఎన్నికల్ని అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈసారి ముందస్తు ఎన్నికల మాటేమో గానీ, ముందస్తు ప్రచారాన్ని మాత్రం అన్ని పార్టీలూ చేపట్టేస్తున్నాయి. అధికార పార్టీ ఎలాగూ అన్ని రకాల మార్గాల్నీ విచ్చల విడిగా వాడేస్తుంది. అందులో తిరుగులేదు. ఆఖరికి సినిమాల్నీ వదల్లేదు. రాజకీయాల్లోకి సినిమాల్ని లాగొద్దని సూక్తులు వల్లిస్తూనే రాంగోపాల్ వర్మతో… రాజకీయ చిత్రాల్ని ముమ్మరంగా తీయిస్తోంది. వ్యూహం ఇప్పటికే సిద్దమైంది. 2024 ఎన్నికలు సమీపించే లోగా మరో రెండు సినిమాల్ని వదలబోతోంది. పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ఓ రెండు సినిమాలు ప్లాన్ చేస్తోంది. వీటికీ రాంగోపాల్ వర్మనే కర్త కర్మ క్రియ.
టీడీపీ కూడా ఇప్పుడు తమ వ్యూహాలకు పదును పెట్టింది. జగన్ ప్రభుత్వంలోని జోకర్ లాంటి మంత్రుల గురించి ఓ సెటైరికల్ సినిమా చేయబోతోందని సమాచారం. చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా మెలిగే ఓ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ మొత్తం పూర్తయ్యింది. ఈ సినిమాలో అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లే ఈ స్క్రిప్టులో హీరోలని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ అభిమానులు సైతం… జగన్ అరాచక పాలన పై వ్యంగ్యాత్మకంగా ఓ సినిమా రూపొందించే ప్లాన్‌లో ఉన్నారు. ఇవి మాత్రమే కాదు. 2024 ఎన్నికలు సమీపించే లోగా మరో అరడజను సినిమాలు వివిధ పార్టీల నుంచి రావొచ్చు. ఇవన్నీ థియేటర్లలో రిలీజ్ అవుతాయా? లేదా? విడుదల సమయానికి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందా? అనే విషయాలు పక్కన పెడితే, సినిమాలోని బిట్స్కి.. క్లిప్లింగ్స్ గా వాడుకొని సోషల్ మీడయాలో ధూమ్ ధామ్ సృష్టించే అవకాశాలు ఉన్నాయి.