కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనను మొదటి సారిగా ఎమ్మెల్యే చేసిన కేసీఆర్ వద్దకే చేరుతున్నారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆయనకే ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
జగ్గారెడ్డి కూడా తన నియోజక వర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా పార్టీ మారుతున్న అంశాన్ని స్పష్టం చేశారని తెలిసింది. తనపై అభిమానం ఉన్నవారు రావచ్చని, తాను మాత్రం ఒత్తడి చేయనని పార్టీ కేడర్‌కు చెప్పినట్లుగా తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డికి మొదటి నుంచి పొసగడం లేదు. పార్టీ కార్యక్రమాల నిర్ణయం, అమలు విషయంలో రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి పలుమార్లు బహటంగానే విమర్శలు చేశారు. ఉత్తమ్ కు గట్టి మద్దతుదారుగా ఉన్న జగ్గారెడ్డి పార్టీ మారడంతో ఇక అందరి చూపు ఉత్తమ్ పై పడింది.
ఆలె నరేంద్ర శిష్యడిగా హిందూత్వ రాజకీయాలు ప్రారంభించిన జగ్గారెడ్డి తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. తర్వాత కొంత కాలంలోనే ఆయనకు కేసీఆర్ తో సరిపడలేదు. వైఎస్ ఆకర్ష్ కు కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ మార్చి మార్చి పోటీ చేశారు. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.