లోకేష్ పాదయాత్ర గన్నవరంలోకి అడుగుపెట్టే సరికి అక్కడ పార్టీని సెట్ రైట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పార్టీలో చేరికలు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు సోదరులు మళ్లీ టీడీపీ గూటికి చేరబోతున్నారు. యార్లగడ్డ వెంకట్రావు కూడా అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి టీడీపీలో చేరే విషయాన్ని ప్రకటించబోతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్లుగా ప్రకటించడంతో .. ఇక యార్లగడ్డ తన దారి తాను చూసుకోవాలనుకుంటున్నారు.
వల్లభనేని వంశీ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో జూనియర్ ఎన్టీఆర్ వత్తిడి చేయడంతో మొదట విజయవాడ లోక్ సభ సీటును చంద్రబాబు ఇచ్చారు. కానీ స్వల్ప తేడాతో ఓడిపోయారు. వల్లభనేని మొదటి నుంచి గన్నవరం టిక్కెట్ కోరేవారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే దాసరి బాలవర్దనరావును కాదని మొదట టిక్కెట్ ఇవ్వలేదు. తర్వాత ఆయనను తప్పించి మరీ గన్నవరం టిక్కెట్ వంశీకి ఇచ్చారు. దీంతో దాసరి సోదరులు అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
ఇటీవల టీడీపీతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారు టిక్కెట్ ఆశిస్తున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వంశీకి ధీటుగా యార్లగడ్డ వెంకట్రావు అయితేనే బాగుంటుందని… గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారనే సానుభూతితో పాటు… వంశీకి ధీటుగా సమాధానం చెప్పగల నేతగా భావిస్తున్నారు. లోకేష్ గన్నవరం పాదయాత్రతో అక్కడ మొత్తం సీన్ మారిపోతుందని.. టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.