Prem Kumar movie telugu review
రేటింగ్: 2/5
ప్రతిభకు, ఫలితాలకూ పొంతన లేకపోవడం.. చిత్రసీమలోనే కనిపిస్తుంటుంది. నటుడిగా ఎంత పరున్నా, మంచి కథలు ఎంచుకోకపోతే.. ఆ ప్రతిభంతా బూడిదలో పోసిన పన్నీరే. సంతోష్ శోభన్ విషయంలో ఇదే జరుగుతోంది. ప్రతీ సినిమాలోనూ నటుడిగా తనకు ఫుల్ మార్క్స్ పడిపోతున్నాయి. కానీ.. తను ఎంచుకొనే కథలు, తన దగ్గరకు వెళ్లే సినిమాలే గాడి తప్పుతున్నాయి. దాంతో యేడాదికి రెండు మూడు సినిమాలు చేసినా సరే, సంతోష్‌కి సరైన హిట్ పడడం లేదు. ఇప్పుడు తన నుంచి మరో సినిమా వచ్చింది. అదే.. ‘ప్రేమ్ కుమార్’. మరి.. ఈసారి సంతోష్ జాతకం ఎలా ఉంది? ఈసారైనా తన కష్టం ఫలించిందా..?
ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్)కి పెళ్లీడు వచ్చినా.. ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వదు. అయినా… పీటలపైనే పెళ్లి ఆగిపోతుంటుంది. దానికి తోడు వ్యాపారం కూడా కలసి రాదు. ఈ ఫస్ట్రేషన్లోనే డిటెక్టీవ్ అయిపోతాడు. పెళ్లిళ్లు ఆగిపోవడంలో అనుభవం ఉంది కాబట్టి.. డిటెక్టీవ్ గా మారి పెళ్లిళ్లు ఆపేసే ఒప్పందాలు కుదుర్చుకొంటుంటాడు. నేత్ర (రుచిత సాధినేని) ఓ ఈవెంట్ మేనేజన్. సినిమా స్టార్ రోషన్ మ్యారేజ్ ఈవెంట్ చేసే బాధ్యత తాను తీసుకొంటుంది. అదే పెళ్లిని చెడగొట్టేందుకు ప్రేమ్ కుమార్ అడ్వాన్స్ తీసుకొంటాడు. మరి.. ఈ పెళ్లి జరిగిందా, లేదా? ప్రేమ్-నేత్రల ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఇదంతా మిగిలిన కథ.
పీటలపై ఆగిపోయిన ఓ కుర్రాడి కథ ఇది. ఈ కోణంలోంచి ఓ కథ అల్లి, సినిమా తీయాలనుకోవడం మంచి ఆలోచనే. కథని ప్రారంభించిన విధానం కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. ‘శుభం’ కార్డుతో సినిమా మొదలెట్టి.. తన క్రియేటివిటీ చూపించాడు దర్శకుడు. తన కథని వాయిస్ ఓవర్ లో హీరో వినిపించడం, తెరపై సన్నివేశాలు కదలడం ఇవన్నీ ఆకట్టుకొంటాయి. అయితే అసలు కథ ఎప్పుడు మొదలైందో అప్పుడే సమస్యలు వచ్చాయి. ఇలాంటి కథల్ని చాలా ఎంటర్టైనింగ్ పద్ధతిలో చెప్పాలి. క్యారెక్టర్లు సరదాగా ఉండాలి. దర్శకుడు ఆ ప్రయత్నం చేశాడు కానీ.. సన్నివేశాల్లోంచే కామెడీ పుట్టదు. హీరో డిటెక్టీవ్ అవతారం ఎత్తిన తరవాత.. కాస్తో కూస్తో ఇంటిలిజెంట్ స్క్రీన్‌ప్లే కనిపించాలి. హీరో తెలివి తేటల్ని.. డిటెక్టీవ్ రేంజ్లో చూపించాలి. అప్పుడే కదా… ఓ సినిమా స్టార్ పెళ్లిని ఆపడానికి డీల్ వస్తుంది. కానీ.. అలాంటి మేధస్సు హీరో డీల్ చేసే కేసుల్లో కనిపించదు.
సినిమా మొదలైన చాలా సేపటి వరకూ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వదు. ఇచ్చినా ఆమెనే ఈ సినిమా హీరోయిన్ అని ప్రేక్షకులకు అర్థం కాదు. ఆ రేంజ్లో హీరోయిన్ ఎంపిక జరిగింది. మందు కొడుతున్నప్పుడు `మద్యపానం ఆరోగ్యానికి హానికరం` అనే ప్రకటన ఇచ్చినట్టు.. ‘ఈ అమ్మాయే మన సినిమాలో హీరోయిన్’ అంటూ.. ప్రతీ క్షణం గుర్తు చేసుంటే బాగుండేది.
హీరోయిన్ ఓ పెళ్లి ఆపాలనుకొంటుంది. హీరో ఆ పెళ్లి చేయాలనుకొంటాడు. నిజానికి ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకొన్న సినిమాలకు ఇలాంటి లైన్లు చాలు. కానీ.. ఈ లైన్ ని పట్టుకొని, సినిమాని ఎటు తీసుకెళ్లాలో తెలీక, కన్ఫ్యూజ్ అయిపోయాడు కొత్త డెరెక్టరు. అసలు ఈ సినిమాని సినిమాలా కాకుండా, వెబ్ సిరీస్‌లా తీయాలనుకొన్నడేమో, సన్నివేశాలన్నీ వెబ్ సిరీస్ లెంగ్త్ లో చాలా సుదీర్ఘంగా సాగుతుంటాయి. కొన్ని సీన్లయితే.. `ఇదెందుకు పెట్టినట్టు? దీని వల్ల ఉపయోగమేమి?` అనే డౌట్లు తీసుకొస్తుంటాయి. హీరో, హీరోయిన్లు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకొంటున్నప్పుడు, వాళ్ల ప్రేమ విఫలం అవుతున్నప్పుడు ఆ ఫీల్ ప్రేక్షకులకు కలగాలి. ‘వీరిద్దరూ పెళ్లి చేసుకొంటే బాగుణ్ణు’ అనైనా అనిపించాలి. ‘ఈ సినిమాకి శుభం కార్డు ఎప్పుడు పడుతుందో’ అనుకొన్నారంటే ఆ లవ్ స్టోరీలో పస లేనట్టే. ప్రేమ్ కుమార్ విషయంలో అక్షరాలా ఇదే జరిగింది.
రోషన్ పాత్రలో కనిపించిన విలన్ ఎవరో కానీ… పది సినిమాలకు సరిపడినంత యాక్టింగు ఈ సినిమాలో చేసేశాడు. అతననేంటి? అందరి పరిస్థితీ అంతే. ఆఖరికి సహజంగా నటిస్తాడనుకొన్న సంతోష్ శోభన్ కూడా. తన గత సినిమాలన్నీ చూసి, `ప్రేమ్ కుమార్` చూస్తే, సంతోష్ ఏంటి మరీ ఇంత కృతకంగా కనిపిస్తున్నాడు? అనే డౌటు వేస్తుంది. కామెడీ చేయాలి.. అని గట్టిగా ఫీలై, ఇలా కాస్త ఓవర్ ది బోర్డ్ యాక్టింగ్ చేసి ఉంటాడు. ఇక హీరోయిన్ సరేసరి. మిగిలిన పాత్రలన్నీ ఇదే రీతిన సాగుతాయి. సన్నివేశంలో బలం ఉన్నప్పుడు, నటీనటుల్లో స్పార్క్ మరింత బయటపడుతుంది. అది కనిపించలేదు.
దర్శకుడు ఎత్తుకొన్న పాయింట్ బాగుంది. కానీ.. దాన్ని రెండున్నర గంటల సినిమాగా మలచడంలో మాత్రం వైఫల్యం కనిపించింది. మేకింగ్, టేకింగ్ కూడా బిలో యావరేజ్ లెవిల్ లోనే ఆగిపోయాయి. ప్రేమ్ కుమార్ ఇంట్రవెల్ బ్యాంగ్ లో ‘ఇప్పుడు హీరో ఏం చేస్తాడు?’ అంటూ కోన్ బనేగా కరోడ్ పతి టైపులో 4 ఆప్షన్లు ఇచ్చాడు దర్శకుడు. ‘ఇక చూసింది చాలు.. ఇంటికెళ్లిపోండి’ అంటూ ప్రేక్షకులకు ఒక్క ఆప్షన్ ఇచ్చినా బాగుండేది.
రేటింగ్: 2/5