బండి సంజయ్ ను తెలంగాణ ఎన్నికల్లో కష్టపడకుండా చేయడానికి హైకమాండ్ చాలా ప్లాన్ల వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చి.. ఆయనను ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఎలా పని చేస్తుందో చూసి రావాలని పంపిస్తోంది. ప్రస్తతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా అంశంపై పరిశలీన జరుగుతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఈ పరిశీలన విషయంలో బీజేపీ శ్రేణులు ఎలా పని చేస్తున్నాయో తెలుసుకునేందుకు వెళ్లి రావాలని బండి సంజయ్ ను హైకమాండ్ పురమాయించింది. ఈ నెల 21వ తేదీన ఈ పని మీద ఆయన అమరావతి వస్తున్నారు. ఏపీలో ఓటర్ల జాబితాలో లెక్కలేన్ని అవకతవకలు ఉన్నాయి. ఈ విషయంపై టీడీపీ , జనసేన పోరాడుతున్నాయి కానీ బీజేపీ మాత్రం పట్టనట్లుగా ఉంది. ఇప్పుడు బండి సంజయ్ వచ్చి ఈ అంశంపై చర్చలు నిర్వహిస్తారు. ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్షుడిగా మార్చిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఏపీ ఇంఛార్జిగా ఉన్న సునీల్ దేవ్‌ధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. దీంతో ఆయనకు ఏపీ వ్యవహారాల కో ఇంచార్జ్ పదవి కూడా పోయినట్లయింది. మరో వైపు ఏపీ బీజేపీ ఇంచార్జ్ గా కూడా బండి సంజయ్ నే నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ దూకుడుతో పార్టీకి మైలేజ్ వచ్చింది. అలాంటి దూకుడుతో ఏపీలోనూ పార్టీకి మైలేజీ తెస్తారని అనుకుంటున్నారు. అయితే అంత మైలేజీ తెలంగాణలో తెచ్చి ఉంటే ఆయనను ఎందుకు ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని.. తెలంగాణలో ఎన్నికల కోసం ఎందుకు పని చేయనివ్వడం లేదన్న ప్రశ్న మొదటగా వస్తోంది.