ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ ఎన్నికల కోసం తన టీమ్ ను ప్రకటించారు. ఇప్పటి వరకూ ఉన్న నలుగురు ప్రధానకార్యదర్శలను మార్చేసి కొత్త వారికి చాన్సిచ్చారు. నలుగురు ప్రధాన కార్యదర్శులుగా విశ్వనాథరాజు, బిట్రా శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, గారపాటి తపనచౌదరిని నియమించారు. అలాగే పదకొండు మందిని ఉపాధ్యక్షులుగా నియమించారు. ఇప్పటి వరకూ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరితో పాటు ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్ రాజు, చందు సాంబశివరావు వంటి సీనియర్ నేతలకూ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. పది మందిని కార్యదర్శులుగా నియమించారు. ఇతర మోర్చాలకూ అధ్యక్షుల్ని నియమించారు. ఎన్నికలు ఎదుర్కోవాల్సిన టీమ్ కావడంతో..చాలా మంది నేతలు కీలక పదవుల కోసం పోటీ పడ్డారు. అయితే ప్రధాన కార్యదర్శులందర్నీ మార్చడం ద్వారా వైసీపీ ముద్రను తొలగించాలని పురందేశ్వరి ప్రయత్నించినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కమిటీ ద్వారా సందేశం పంపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కొంత మంది ప్రాధాన్యత తగ్గించడం ద్వారా.. తాము ఏ పార్టీకి అనుకూలం కాదన్న వాదనను వినిపించడానికి ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత కొత్త టీమ్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. చివరికి గత అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్ర లేకుండా నియమించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. సోము వీర్రాజు బృందం ఉన్నప్పుడు .. వైఎస్ఆర్‌సీపీ అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. ఏపీ బీజేపీలో జనంలో పలుకుబడి ఉన్న నేతలు తక్కువే అయినా వర్గపోరాటానికి మాత్రం కొదవ ఉండదు. పురందేశ్వరి టీమ్‌తో చాలా మంది సీనియర్లు అసంతృప్తికి గురవుతున్నారు.