ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల కొత్త అధ్యక్షురాలుగా రాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వస్తుందో లేదో కానీ ఓ డౌట్ మాత్రం ఇప్పుడు వైసీపీ ఫ్యాన్స్ ను కంగారు పెట్టేస్తోంది. షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే.. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు కొన్ని పరిణామాలు జరిగాయి పరిస్థితులు మారాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను స్థాపించిన పార్టీని విలీనం చేసేసి.. ఏపీలో తన అన్నను గట్టిగా ఢీకొనాలనే ధృఢ సంకల్పంతో ఉన్నారని చెబుతున్నారు.
రాజకీయాల్లోకి వచ్చాక బలమున్న చోటే వెదుక్కోవాలి. లేకపోతే కష్టం. ఈ సూత్రం తెలియకుండా షర్మిలరాజకీయం చేయరు. తెలంగాణలో ఆమె ప్రభావం జీరో. ఇక ఏటూ తేల్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మొహమాటాలు వదిలేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమె తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది పెద్ద డౌట్ గా మారింది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. అందుకే వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేశారు.
ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిపైకి ఒకరు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్ాయి. షర్మిల ఏపీకి వచ్చేయాలనే నిర్ణయమే తీసుకుంటే.. షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆమె రెండు కళ్లల్లో ఏదోక కంటికే ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ? షర్మిళ వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే భావిస్తారు. ఇప్పటికే తల్లి.. చెల్లెలను పట్టించుకోవడం లేదనే విమర్శలను జగన్ ఎదుర్కొంటున్నారు. ఇక షర్మిళ నేరుగా ఏపీ రాజకీయ రంగంలోకి దూకితే.. ఆమె నేరుగా జగన్ను విమర్శించే పరిస్థితి వస్తుంది. అంతే కాకుండా.. వైఎస్ వివేకా కుమార్తె సునీతమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి.. షర్మిళకు దన్నుగా నిలిచినా ఆశ్చర్యం పోనక్కర్లేదని అంటున్నారు. షర్మిల తీసుకునే నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంది.