ఇటీవల జయసుధ బీజేపీలో చేరారు. ఇప్పుడు జయప్రద బీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆమెను ఏపీ నుంచో.. తెలంగాణ నుంచో కాకుండా.. మహారాష్ట్ర నుంచి పోటీ చేయించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మహారాష్ట్ర, తెలంగాణల్లో అన్ని పార్లమెంట్ సీట్లు గెల్చుకుంటే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టకుండా ఒక్క మహారాష్ట్రపైనే వ్యూహాలు పన్నుతున్నారు.
జయప్రద దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటి మాత్రమే కాదు రాజకీయ నాయకురాలు కూడా. టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ… తర్వాత ఆమె సమాజ్ వాదీ పార్టీలోనే ఎక్కువ కాలం ఉన్నారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అమర్ సింగ్ ఆమెకు రాజకీయ గురువుగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడింది. ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. చాలా పార్టీల్లో చేరుతారన్న ప్రచారం జరిగింది కానీ ఎక్కడా చేరలేకపోయారు.
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున మహారాష్ట్రలో పోటీ చేసే చాన్స్ కేసీఆర్ ఇస్తున్నారు. మహారాష్ట్రలోనూ జయప్రదకు గుర్తింపు ఉంది. రాజకీయ నాయకురాలిగానూ గుర్తిస్తారు. అయితే… మహారాష్ట్రలో ఇలా స్థానికేతర అభ్యర్థుల్ని అక్కడి ప్రజలు పరిగణలోకి తీసుకుంటారా అన్నది డౌటే. అయితే కేసీఆర్ మాత్రం గుర్తింపు ఉన్న అభ్యర్తులు చాలా ముఖ్యమని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.