ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు నేస్తం పేరుతో ఓ పథకానికి బటన్ నొక్కాల్సి ఉంది. పెండింగ్ పథకాలు చాలా ఉన్నాయి కానీ.. ఈ పథకం కీలకం.. ఇందు కోసం ముహుర్తం ఖరారు చేశారు. కానీ డబ్బుల్లేక పోవడంతో వర్షాల పేరుతో నెలాఖరు కు వాయిదా వేశారు. ఎన్నికలు దగ్గర పడుతూండటంతో అస్మదీయ కాంట్రాక్టర్లు అందరూ చెల్లింపుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీటి కోసం అప్పులు చేయాల్సి వస్తోంది.
ఇప్పటికి ఏపీ చేయాల్సిన అప్పు కంటే్ రెట్టింపు చేసింది. మామూలుగా అయితే ఒక్క రూపాయి అప్పు కూడా పుట్టదు. కానీ గత నాలుగేళ్ల నుంచి చేస్తున్నట్లుగా.. .. కేంద్రం దగ్గర ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పులకు అనధికారిక అనుతులు కోసం అప్రకటిత హైలెవల్ కమిటీ చాలా రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసింది. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అర్బీఐ నుంచి అదనపు అప్పుల కోసమే కాదు.. ఇతర మార్గాల ద్వారా సేకరణకు ఈ కమిటీ ప్రయత్నిస్తోంది.
లిక్కర్ బాండ్లను కొనేందుకు ఇతర సంస్థలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం అవసరమైన తెర వెనుక ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అయితే కేంద్రం సహకారంపై మాత్రమే ఇప్పుడు అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఇంత కాలం అడిగినన్ని అప్పులకు పర్మిషన్ ఇచ్చినా.. చేస్తున్న అప్పుల గురించి వివరాలు చెప్పకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇలాంటి వాటికి అనుమతులు ఇస్తారా అన్నది కీలకంగా మారింది.
అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం తరపున కొందరు ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా… రాష్ట్రాలు అప్పులు చేయడానికి ఇలా కూడా ప్రయత్నిస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. ఎంత అప్పు ఇప్పించడానికే సహకరిస్తే.. దానికి ప్రైవేటుగా కమిషన్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి అప్పు ఇస్తే.. ప్రైవేటుగా కమిషన్లు ఎందుకిస్తున్నారోనని కొంత మంది ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా ఏపీ అప్పుల ప్రయత్నాలు ఢిల్లీలో లాఫింగ్ స్టాక్ గా మారిపోయాయి.