‘అఖండ’ తరవాత బాలకృష్ణ ఇమేజ్ కాస్త మారింది. తన వయసుకి తగిన పాత్రల్ని ఎంచుకొంటూ, తన అభిమానుల్ని సంతృప్తి పరచుకొంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన చేతిలో ఉన్న సినిమా `భగవంత్ కేసరి`. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ… కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమాలే చేశాడు. అయితే ఈసారి బాలయ్య కోసం ఓ సీరియస్ సబ్జెక్ట్ కి ఎంచుకొన్నాడు. ఓ తండ్రి ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమా సాగబోతోంది. బాలయ్య గెటప్, తన పాత్ర చిత్రణ, డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ ఈ సినిమాలో కొత్తగా ఉండబోతున్నాయి. ఇటీవల చిత్రబృందం రషెష్ చూసుకొంది. సినిమా వచ్చిన విధానంపై పూర్తి సంతృప్తితో ఉంది. ఓరకంగా ఇది బాలయ్యకే కాదు, అనిల్ రావిపూడికీ కొత్త తరహా ప్రయత్నమే. బాలయ్య ఇమేజ్‌తో పాటుగా.. రావిపూడి ఇమేజ్ కూడా ఈ సినిమాతో పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈతరం దర్శకుల్లో బాలయ్యని అభిమానులకు నచ్చేలా చూపిస్తాడన్న పేరు బోయపాటి శ్రీను సొంతమైంది. అయితే.. ఈ లిస్టులో ఇక ముందు అనిల్ రావిపూడి పేరు కూడా చేరబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
సెట్లో కూడా బాలయ్య కొత్తగా కనిపిస్తున్నాడని, తన ప్రవర్తన కొత్తగా ఉందని టీమ్ చెబుతోంది. సాధారణంగా బాలయ్య సెట్లో ఉంటే, అందరూ అటెన్షన్లో ఉండిపోతారు. బాలయ్య జోకులు వేసి, నవ్వించడం తప్ప, మిగిలిన వాళ్లు అంతగా చనువు తీసుకోరు. కానీ.. భగవంత్ కేసరి సెట్లో పరిస్థితి భిన్నంగా ఉందని తెలుస్తోంది. బాలయ్య ప్రతి ఒక్కరినీ పేరు, పేరునా పలకరిస్తురన్నాడని, ముఖ్యంగా శ్రీలీలతో మరింత స్నేహంగా, ప్రేమగా ఉంటున్నాడని తెలుస్తోంది. సెట్లోనే కాదు.. బయట కూడా `అమ్మా.. అమ్మా` అంటూ కన్న కూతురిలానే చూసుకొంటున్నాడట. బాలయ్య ఆప్యాయతకు శ్రీలీల కూడా పొంగిపోతోందట. ఈమధ్య మన స్టార్ హీరోలు వయసుకు మించిన పాత్రలు చేయడం లేదన్న ఓ విమర్శ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య మాత్రం హుందాగా కనిపిస్తాడని, తన నటన, ఆహార్యం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఇప్పటికే రషెష్ చూసినవాళ్లు చెబుతున్న మాట.