భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పట్టించుకోకపోతూండటంతో పార్టీలో చేరిన వారు కూడా దండం పెట్టేస్తున్నారు. ఒడిషా బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్న గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ తన అనుచరులతో కలిసి రాజీనామలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ఢిల్లీ వెళ్లి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. గతంలో ఒడిషాలో పార్టీ విస్తరణ కోసం మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కుటుంబాన్ని ఒప్పించారు. జనవరిలో ఒడిషా నుంచి ప్రత్యేక విమానాల్లో వారందర్ని హైదరాబాద్కు పిలిపించి కండువాలు కప్పారు. ఒడిషా చీఫ్ గా నియమించారు.
ఒడిషాలో భారీగా పార్టీ ఆఫీసు ప్రారంభిస్తామని బహిరంగ సభ కూడా ఏర్పాటు చే్స్తామని కేసీఆర్ చెప్పారు. పార్టీ ఆఫీసు కోసం వెదికే పని అప్పట్లోనే పార్టీలో చేరిన రావెలకిషోర్ కు అప్పగించారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. రావెల కిషోర్ కూడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల కోసం నిధులు సర్దుబాటు చేయడానికి కూడా కేసీఆర్ ఆసక్తి చూపించకపోవడంతో గిరిధర్ గమాంగ్తో పాటు ఇతర నేతలు .. ఇక పార్టీ మరిపోవడం మంచిదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ లోకి వారు బీజేపీ నుంచి వచ్చి చేరారు. కానీ గమాంగ్ కుటుంబం.. సంప్రదాయంగా కాంగ్రెస్ కు చెందిన వారు. ఎంపీగా గిరిధర్ గమాంగ్ రికార్డు స్థాయిలో విజయం సాధించారు. అయితే తర్వతా కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో బీజేపీలో చేరారు. అక్కడా నిరాదరణ ఎదురుకావడంతో…బీఆర్ఎస్ లోచేరారు.చివరికి మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. అయితే ఇలా నేతల్ని చేర్చుకుని కేసీఆర్ ఎందుకు అలా గాలికి వదిలేశారన్నది ఇప్పటికీ పజిల్ గానే ఉంది.