పంచాయతీ సర్పంచ్‌లు.. వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో గ్రామల్లో వైసీపీపై ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో స్పష్టమయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తర్వాత చనిపోయిన వారి స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇవన్నీ ఒకటి రెండు అన్నీ సిట్టింగ్ స్థానాలే. కానీ ఇప్పుడు సగానికిపైగా వైసీపీ పోగొట్టుకుంది. వైసీపీ హైకమాండ్ కూడా ఊహించని ఫలితాలు వచ్చాయి.
మొత్తం ఏపీలో 59 పంచాయతీల ఎన్నికలు జరిగాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ 28 పంచాయతీలను గెల్చుకుంది. వైఎస్ఆర్సీపీ 17 స్థానాలను.. ఇతరులు 12 చోట్ల విజయం సాధించారు. జనసేన రెండు గ్రామాల్లో తమ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించింది. ఇక పంచాయతీ వార్డుల్లో 485 వార్డ్స్ కి ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకగ్రీవాలతో సహా తెలుగుదశం మొత్తం 189 వార్డుల్లో విజయం సాధించింది. వైసీపీ 177 స్థానాల్లో ఇండిపెండెంట్లు 100 స్థానాల్లో.. జనసేన, బీజేపీ అభ్యర్థులు 19 స్థానాల్లో విజయం సాధించారు.
వైసీపీకి కంచుకోటల్లాంటి అనేక గ్రామాల్లో ఈ సారి టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం రాజకీయ పరిశీలకుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. తెనాలి బుర్రిపాలెం సర్పంచ్ స్థానాన్ని భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెల్చుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న అముదాల వలసలో బొప్పడం గ్రామ పంచాయతీని వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అది వైసీపీ సిట్టింగ్ స్థానమే. కానీ ఇప్పుడు అక్కడ టీడీపీ విజయం సాధించింది.
గత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 80శాతానికిపైగా సీట్లను కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక బయటపడేలా ఎన్నికల ఫలితాలు వస్తున్నయి. ఇవి ఉపఎన్నికలు కాబట్టి తప్పనిసరిగాపెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే కాకినాడ కార్పొరేషన్ తో పాటు చాలా మున్సిపాలిటీల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. అవి పెట్టకుండా ప్రభుత్వం తప్పించుకుంటోంది.