ఆంధ్రప్రదేశ్లో నిరంతరాయంగా ఇసుక దొంగతనం జరిగిపోతోంది. కళ్ల ముందే తరలించుకపోతున్నారు. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకూ ఇసుక తవ్వకాల్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశిచింది. ఏపీలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకునేవారు లేరు. అదే సమయంలో గతంలో ఇసుక కాంట్రాక్టులు పొందిన జేపీ, టర్న్ కీ అనే సంస్థల గడువు ముగిసింది. మళ్లీ కాంట్రాక్టులు ఇవ్వలేదు. కానీ వారే ఇసుక తరలించేస్తున్నారు. వే బిల్లులు కూడా ఆ సంస్థల పేరు మీదే జారీ చేస్తున్నారు. అంటే ఇది పట్టపగలు దొంగతనం. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది ?
జేపీ సంస్థ జీఎస్టీ నెంబర్ ను కూడా సస్పెండ్ చేసినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే జీఎస్టీ కూడా కట్టడం లేదన్నమాట. ఇదంతా చూస్తూంటే.. అసలు ఏపీలో ఏం జరుగుతుందా అన్న డౌట్లు ఎవరికైనా వస్తాయి. ప్రభుత్వ పెద్దలు ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రాసులు పోసి ఇష్టారీతిన అమ్ముకుంటున్నారు. అదీ కూడా సొంతానికి. ప్రతీ నెల కనీసం వేయి కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మునంతటిని తమ జేబుల్లోకి నెట్టేసుకుంటున్నారు. అసలు విచిత్రం ఏమిటంటే ఇది బహిరంగంగా జరుగుతోంది.
ఎవరైనా గ్రామీణులు తమ ఇంటి అవసరాల కోసం దగ్గరలో ఎడ్ల బండి మీద ఇసుక తెచ్చుకుంటే అధికారులు వాటిని పోలీసుస్టేషన్ కు తీసుకెళ్లిపోతారు. కానీ ఏపీలో పదహారు టైర్ల లారీలు విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నా ఎవరికీ కనిపించడం లేదు. పట్టుకోవడం లేదు. ఏమీ తెలియనట్లుగా కనిపించనట్లుగా ఉంటున్నారు. ఎవరైనా అడిగితే… . ఏపీలో అసలు ఇసుక తవ్వకాలే లేవని ఫ్యాక్ట్ చెక్ లు రిలీజ్ చేస్తారు. కానీ ప్రజాఆస్తుల్ని ఇలా అడ్డగోలుగా దోచుకోవడం తప్పని మాత్రం అనుకోవడం లేదు.
గత ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇచ్చింది, రవాణా, లోడింగ్ చార్జీలు పెట్టుకుని కావాల్సిన ఇసుక ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఆ ఇసుక దారి తప్పేది కాదు. తాము ఇల్లు కుట్టుకుంటున్న చూపించిన ప్రతి ఒక్కరికి ఇసుక వచ్చేది. ఇప్పుడు అలా కాదు… ఇల్లు కట్టుకునేవారికీ చుక్కలు చూపిస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాలతో బయటకు తరలిపోయే ఇసుకే ఎక్కువగా ఉంది. ఇదంతా అనధికారికం. మొత్తంగా ఏపీలో దొంగల రాజ్యం నడుస్తోందని ఇసుక విషయంలో ప్రజలు గొణుక్కుంటూంటే అది వారి తప్పు కాదు. పాలకులదే.