భోళా శంకర్ ఎఫెక్ట్ తో చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో ఆలోచనలో పడ్డాడని, కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే.. కొత్త సినిమా ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే.. చిరు ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదు. ముందు అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజున కొత్త సినిమా ప్రకటన వచ్చేస్తోంది. ఒకటి కాదు.. ఒకేసారి రెండు.
బింబిసార దర్శకుడు వశిష్ట కథకి చిరు ఓకే చెప్పాడన్న సంగతి తెలిసిందే. యవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అంతేకాదు.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నాడు. సుస్మిత కొణిదెల నిర్మాత. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రేపే రానుంది.
ఈలోగా… మురుగదాస్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మురుగదాస్ దగ్గర చిరుకి సరిపడ ఓ కథ ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లకపోవొచ్చు.