తన రాజకీయ ప్రత్యర్థుల ఊహకు కూడా అందని రీతిలో ఎత్తులు వేయడంలో కేసీఆర్ ది అందవేసిన చేయి అని మరొకసారి నిరూపించే విధంగా, ఎవరు ఊహించని రీతిలో, అందరికంటే ముందు దాదాపు 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాడు కేసీఆర్. దీంతో ఏ రాజకీయ నాయకుడికి అధికార పార్టీ టికెట్ దక్కింది ఏ రాజకీయ నాయకుడికి మిస్సైంది అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ అయినటువంటి బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర రెడ్డికి కెసిఆర్ మొండి చేయి చూపించడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే
కొద్ది రోజుల కిందట నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తన మామ కంచర్ల చంద్ర శేఖర రెడ్డి నిర్మించిన కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు కెసిఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నాడని, ఇస్తే అల్లు అర్జున్ కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదలైన లిస్ట్ లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు ఎక్కడా లేకపోవడం చర్చకు దారి తీసింది. 2014లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన చంద్రశేఖరరెడ్డి, టిడిపి అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించడంతో చంద్రశేఖర రెడ్డికి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ లభించలేదు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంచిరెడ్డి విజయం సాధించడంతో ఆ నియోజకవర్గంలో ఆయన పాతుకుపోయారు. దీంతో అల్లు అర్జున్ మామ నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్న సమాచారం బయటకు వచ్చింది. అయితే ఈ నియోజకవర్గంలో తన తండ్రి మరణానంతరం 2021 లో ఉప ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన యువ నాయకుడు నోముల భగత్ కి కెసిఆర్ మద్దతు ప్రజల మద్దతు మెండుగా ఉండడంతో చంద్రశేఖర రెడ్డికి ఇక్కడి నుండి టికెట్ లభించే అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులు వెలిబుచ్చారు. వారి అభిప్రాయాన్ని నిజం చేస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గం టికెట్ నోముల భగత్ కే కన్ఫామ్ చేశారు కేసీఆర్.
మొత్తానికి అల్లు అర్జున్ మామగారు అయిన చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయాలనుకున్న రెండు నియోజకవర్గాలలోనూ బీఆర్ఎస్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉండడంతో భవిష్యత్తులో కూడా ఈ రెండు నియోజకవర్గాల నుండి ఆయనకు పోటీ చేసే అవకాశం లభించకపోవచ్చు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ మారి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటారా లేక బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్నది వేచి చూడాలి..