ఆదివారం పూట సీఐడీతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు ఏకంగా డీజీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మార్గదర్శిలో చేసిన సోదాల్లో మూడు కొత్త కేసులు పెట్టామని చెప్పడానికి. మీడియాకు విందు కూడా ఇచ్చారు. ఆ సమావేశంలో పెట్టినట్లుగా చెప్పిన మూడు కేసుల్లో… రిమాండ్ ఇవ్వడానికి కోర్టులు నిరాకరించాయి. చూడగానే అవన్నీ తప్పుడు కేసులని తేలిపోతుంది. ఓ ఖాతాదారుడు అనారోగ్యంతో చెన్నై ఆస్పత్రిలో ఉంటే అతని భార్య వద్ద నుండి చిట్ వేయలేదని స్టేట్ మెంట్ తీసుకుని కేసు పెట్టారు. ఆ రోగిని భయపెట్టి… చిట్ వేశానో లేదో గుర్తు లేదని స్టేట్ మెంట్ తీసుకుని కేసు పెట్టారు. నిజంగా చిట్ వేయకపోతే.. తేల్చడం ఎంత సేపు..?. భయపెట్టి అది చేశారని కోర్టుకు అర్థమైపోయింది. డాక్యుమెంట్స్ అడిగారు.. సీఐడీ సమర్పించలేకపోయింది. ష్యూరిటీలు సమర్పించలేకపోయిన ఓ డిఫాల్టర్ ను పట్టుకొచ్చి కేసు పెట్టారు. ఇలాంటి కేసులు పెట్టడానికి వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తున్న తీరు… దిగ్భ్రాంతికరంగా ఉంది.. ఈ వ్యవహారంలో భాగమవుతున్న అధికారులు.. తీరు జుగుప్సాకరంగా ఉంది.
ఇదంతా సీఎం జగన్ రెడ్డి వ్యక్తిగత కక్ష తోనే చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని చేస్తుంది. పగ, ప్రతీకారాలు అనేవి… విచక్షణను నశింప చేస్తాయి. అదే మూర్ఖులకు అయితే… చెప్పల్సిన పని లేదు. ప్రస్తుతం జగన్ రెడ్డి రామోజీరావుపై పగతో… మార్గదర్శిని మూయించాలన్న లక్ష్యంతో పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు నిజాలు చెప్పాల్సిన అధికారుల బృందం… ఆ పిచ్చి పగ తీర్చుకునే వ్యూహంలో భాగంగా మారారు. చేయగలిగినంత చేస్తున్నారు. కానీ మార్గదర్శి వెంట్రుక కూడా పీకలేకపోతున్నారు. ఈ గొడవ అంతా జరుగుతూండగానే కర్ణాటకలో కొత్త బ్రాంచీల్ని మార్గదర్శి ప్రారంభించుకుంది.
రాజకీయాల్లో పగ, ప్రతీకారాలతో రగిలిపోతే… ఏం జరుగుతుందో… ప్రతి ఒక్కరికీ తెలుసు. అదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే… ఇక చెప్పాల్సిన పని లేదు. అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేస్తూ.. జగన్ రెడ్డి సర్కార్… రామోజీరావును టార్గెట్ చేసింది. ఈ క్రమంలో జగన్ రెడ్డి ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చాలా మంది అధికారుల్ని నేరస్తులుగా మారుస్తున్నారు చివరికి ఇవన్నీ ఆయనకు బ్యాక్ లాగ్స్ గా మారిపోతాయి కానీ.. తన పగ, ప్రతీకారాల్ని తీర్చుకోలేరు. ఈ వ్యవహారం జగన్ రెడ్డిని ఎలా వెంటాడబోతోందో భవిష్యత్ లో కథలు కథలుగా చెప్పుకోవచ్చు.