జనసేన చీఫ్ పవన్ కల్యాణ్… వచ్చే మూడు నెలల పాటు కొంత కాలం షూటింగ్లకు కాల్ షీట్లు కేటాయించారు. వారాహి యాత్రకు కొంత గ్యాప్ రానుంది. ఉభయగోదావరి జిల్లాల్లో .. విశాఖ సిటీలో వారాహి యాత్ర పూర్తయింది. ఇప్పుడు కంప్లీట్ చేయాల్సిన సినిమాలను చూసుకుంటున్నారు. నిజానికి ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ఉద్దేశంతోనే జూన్ నుంచి పవన్ కల్యాణ్ జనంలోకి రావడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ముందస్తు రావని క్లారిటీ వచ్చేసింది ఎన్నికలు వచ్చే మార్చి తర్వాత ఉంటాయి. ఈ లోపు… నిర్మాణంలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తే ఓ భారం దిగిపోతుందని భావిస్తున్నారు.
వచ్చే మూడు నెలల పాటు నెలలో సగం రోజులు షూటింగ్లకు కేటాయించే అవకాశం ఉంది. ఉస్తాద్ భ గత్ సింగ్, ఓజీ సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఉస్తాద్ ఎన్నికలకు ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే జనసేన పార్టీ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు ఎప్పుడూ హైలెట్ అయ్యేలా ఏదో ఓ కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో పొత్తులు, అభ్యర్థుల అంశంపై… పార్టీ ముఖ్య నేతలతో పవన్ ఎప్పటికప్పుడు చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఎన్నికల ఏడాదిలో పూర్తిగా పవన్ రాజకీయాలకే సమయం కేటాయించి ఉంటే మరింత సీరియస్ నెస్ ఉండేదని జనసైనికులు భావిస్తున్నారు. ముందస్తుగా ప్రణాళిక లేకపోవడం వల్ల ఎన్నికల సమయంలోనూ షూటింగ్లకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అయితే పార్టీ నడపడానికే… పవన్ సినిమాలు చేస్తున్నారని… రెండు పడవలపై కాళ్లు పెట్టినా… సమన్వయం చేసుకుంటారని జనసైనికులు ధీమాతో ఉన్నారు.