భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల్లో ఏడుగురు మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడూ ఆ రేంజ్ కన్నా ఎక్కువ అవకాశం కల్పించలేదు. కానీ ఈ సారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే.. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత .. పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టాలని 33 శాతం రిజర్వేషన్లు కావాలని ఢిల్లీ లెవల్లో ఉద్యమం చేశారు మరి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత డిమాండ్ ను ఆమె తండ్రి, తమ పార్టీ చీఫ్ కేసీఆరే పట్టించుకోనట్లుగా అయింది.
సొంత పార్టీని .. అదీ కూడా తండ్రిని కవిత ప్రశ్నించలేరు. కానీ ఇక ముందు ఆమె మహిళా రిజర్వేషన్ కోసం ఉద్యమం అంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ పిలిచారని అందుకే మహిళా రిజర్వేషన్ పేరుతో పోరాటం చేశారన్న విమర్శలు వచ్చాయి. ఆ కేసు లో కదలికలు ఆగిపోవడంతో.. కవిత కూడా మహిళా రిజర్వేషన్ ఉద్యమం గురించి పట్టించుకోలేదు.
గత మార్చిలో ఆమె మహిళా రిజర్వేషన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మిస్డ్ కాల్ కార్యక్రమంతో పాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు , చర్చలు నిర్వహిస్తామని ప్రకటించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపుతామని అన్నారు. కానీ ఈడీ సైలెంట్ అయ్యేసరికి తానూ సైలెంట్ అయ్యారు.
మహిళా బిల్లు ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఉపయోగపుతోంది. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో సీపీఐ ఎంపీ గీతాముఖర్జీ దేశమంతా తిరిగి మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి పార్లమెంటుకు నివేదిక ఇచ్చారు. ఆ తరువాత దేవెగౌడ హ యాంలో కొన్ని రాజకీయ పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. మన్మోహన్సింగ్, దేవెగౌడ, గుజ్రాల్ ప్రధానులుగా ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలకు పూర్తి స్థాయి సంఖ్యాబలం లేదు. కానీ మోదీ ప్రభుత్వానికి పూ ర్తిస్థాయి మెజారిటీ ఉన్నది. మోదీ సర్కారు బిల్లు తేవడానికి ఇష్టపడటం లేదు. బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు తెస్తే సమర్థిస్తామని అన్ని పార్టీలు చెబుతున్నాయి. దీంతో కవిత పోరాటానికి మద్దతు లభించింది. కానీ ఇప్పుడు సొంత పార్టీలో సీట్లు అతి తక్కవగా కేటాయించడంతో.. ఆమె ఉద్యమం గురించి మళ్లీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.